చనిపోతూ.. తొమ్మిది మందికి ప్రాణం పోశారు

చనిపోతూ.. తొమ్మిది మందికి ప్రాణం పోశారు
  • వేర్వేరు ప్రమాదాల్లో 13 ఏండ్ల రోహిత, 19 ఏండ్ల కమలాకర్ బ్రెయిన్ డెడ్
  • పుట్టెడు దుఖంలోనూ అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబాలు

హైదరాబాద్, వెలుగు:  రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒకరు.. విధి నిర్వహణలో కరెంట్ షాక్ తగిలి మరొకరు బ్రెయిన్ డెడ్ కాగా, వారి కుటుంబాలు పుట్టెడు శోకంలోనూ ఆదర్శంగా నిలిచాయి.  తమ బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లినా, వారి అవయవాల ద్వారా మరికొందరికి ప్రాణదానం చేశాయి. 

కరెంట్ షాక్‌‌తో కిందపడి..

మెదక్ జిల్లా జగదేవ్‌‌పూర్ మండలం కొండాపూర్ (గొల్లపల్లి) గ్రామానికి చెందిన తోకల జంగీర్ కుమారుడు కమలాకర్ (19) కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 27న విధుల్లో భాగంగా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పైనుంచి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన కమలాకర్‌‌ను వెంటనే హైదరాబాద్‌‌ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 30న కమలాకర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కళ్ల ముందే చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారినా, తండ్రి జంగీర్ పెద్ద మనసుతో అవయవదానానికి అంగీకరించారు. కమలాకర్ నుంచి రెండు కిడ్నీలు, లివర్‌‌ను సేకరించి ముగ్గురు నిస్సహాయ రోగులకు అమర్చారు. ఇది ఈ ఏడాదిలో 174వ అవయవదానంగా నమోదైంది.

గుడికి వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదం..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన గూడ నారాయణరావు కూతురు రోహిత (13) కూకట్‌‌పల్లిలోని గవర్నమెంట్ మున్సిపల్ హైస్కూల్‌‌ లో తొమ్మిదో తరగతి చదువుతోంది. అక్టోబర్ 20న కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా, బాలానగర్ ఫ్లైఓవర్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బాలికను వెంటనే సిటీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 30న డాక్టర్లు రోహితను బ్రెయిన్ డెడ్‌‌గా ప్రకటించారు. ఈ విషాదంలోనూ తండ్రి నారాయణరావు కూతురి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

రోహిత నుంచి రెండు కిడ్నీలు, రెండు భాగాలుగా విభజించిన కాలేయం (లివర్), రెండు కార్నియాలను సేకరించి మొత్తం ఆరుగురు రోగులకు అమర్చి ప్రాణం పోశారు. దీంతో ఈ ఏడాది జీవన్‌‌దాన్ ద్వారా నమోదైన అవయవదానాల సంఖ్య 175కి చేరింది. తీవ్ర దుఖంలోనూ మానవత్వాన్ని చాటి తొమ్మిది మంది జీవితాల్లో వెలుగులు నింపిన రోహిత, కమలాకర్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ జీవన్‌‌దాన్ ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. వీరి నిర్ణయం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.