- నవంబర్ 15 నాటికి మిషన్ భగీరథ నుంచి అదనంగా 40 ఎంజీడీల నీరు
- 10 వేల నుంచి 30 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్లు.. ప్రత్యేక యాప్‌లో బుకింగ్
హైదరాబాద్, వెలుగు: నగరంలో తాగునీటి వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఆదివారం నుంచి ‘గ్రీన్ ట్యాంకర్ల’ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. సచివాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలు, గార్డెనింగ్, క్లీనింగ్ తదితర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటినే వినియోగించాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా నగరానికి అదనంగా 40 ఎంజీడీల నీటిని అందించే ప్రాజెక్టును నవంబర్ 15 నాటికి పూర్తి చేస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.
వచ్చే ఏడాది ఆగస్టు వరకు విలీన పట్టణ స్థానిక సంస్థలకు బల్క్ వాటర్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. ఎస్టీపీల వద్ద ప్రత్యేక ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి 10 వేల, 20 వేల, 30 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. తొలి దశలో 300 నుంచి 400 ట్యాంకర్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 155313, 040-23300114 నంబర్లతో పాటు ప్రత్యేక యాప్, వెబ్‌సైట్ ద్వారా ట్యాంకర్లను బుక్ చేసుకోవచ్చు.
