హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో బురఖా ధరించి ఇండ్లలో చోరీలు..కొత్తగూడెంకు చెందిన మహిళ అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో బురఖా ధరించి ఇండ్లలో చోరీలు..కొత్తగూడెంకు చెందిన మహిళ అరెస్ట్
  •     మరో కేసులో ల్యాబ్ టెక్నీషియన్ పట్టివేత
  •     రూ.కోటికి పైగా సొత్తు స్వాధీనం 

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నగరంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ఘరానా దొంగలను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుమతి తెలిపారు. శనివారం సికింద్రాబాద్ లోని మల్కాజ్​గిరి కమిషనరేట్ క్యాంప్​ఆఫీస్​లో వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చెందిన పాగా జయ బీటెక్ ప్రథమ సంవత్సరం వరకు చదివి, హైదరాబాద్​నగరానికి వచ్చి ఉప్పల్ భారత్ నగర్‌‌‌‌‌‌‌‌లో నివాసముంటోంది. విలాసవంతమైన జీవితం కోసం బురఖా ధరించి కాలనీల్లో రెక్కీ నిర్వహించేది. 

ఈ నెల 27న ఉప్పల్‌‌‌‌‌‌‌‌లో బాధితులు ఊరికి వెళ్లిన సమయంలో అత్యాధునిక హ్యాండ్ కట్టర్‌‌‌‌‌‌‌‌తో తాళాలు పగులగొట్టి, 48 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.2 లక్షల దోచుకెళ్లింది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.70 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. జయ ఈ ఏడాదిలో మొత్తం 5 చోరీలకు పాల్పడినట్లు తేలింది. మరో కేసులో.. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా నెల్లికుదురు మండలం రతిరామ్​తండాకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ గుగులోతు నవీన్ పై 18 చోరీ కేసులున్నాయి. గత నెల 7న జనగామ జైలు నుంచి విడుదలయ్యాడు. 12 రోజుల వ్యవధిలో 10 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఏఎస్ రావు నగర్ పరిధిలో తాళం వేసిన ఫ్లాట్‌‌‌‌‌‌‌‌లో 37 తులాల బంగారం అపహరించిన ఇతడిని కుషాయిగూడ, సీసీఎస్ పోలీసులు పట్టుకుని మొత్తం సొత్తును రికవరీ చేశారని సీపీ పేర్కొన్నారు.