ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 13 నగరపాలక సంస్థల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో మొత్తం 99.36 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో 10 వేల 262 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 3న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
17 మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవం
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే 17 మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో టీడీపీ 15 స్థానాలను, జనసేన, బీజేపీ ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నాయి. కడప జిల్లాలో కూటమి ఖాతాలోకి ఆరు పట్టణ స్థానిక సంస్థలు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వార్డుల్లో 21 శాతానికి పైగా, డివిజన్లలో 12 శాతానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 13 నగరపాలక సంస్థల్లోని మొత్తం 922 డివిజన్లకు గాను 118 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.
కడపలో పోలీసుల అప్రమత్తత
కడపలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్ల పత్రాలను కొందరు నాయకులు చించివేస్తున్నారని, ఏజెంట్లను లోపలికి అనుమతించకుండా బయటకు పంపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా, పాకా సురేష్‌లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిఘా పెంచారు
