- పటేల్ చూపిన సమైక్యతా స్ఫూర్తితో ముందుకెళ్లాలి: రాంచందర్ రావు
- బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో సర్దార్ పటేల్ జయంతి
హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ మొదటి ఓటు చోరీకి పాల్పడిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. మెజారిటీ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ తొలి ప్రధాని కావాలని కోరుకున్నప్పటికీ, ఏమాత్రం ప్రజా మద్దతు లేని నెహ్రూను పీఠంపై కూర్చోబెట్టారని ఆరోపించారు.
శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాయకులు పాల్గొని పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నాడు హోంమంత్రిగా పటేల్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతోనే 550కి పైగా సంస్థానాలు భారత్‌లో విలీనమై అఖండ భారతం ఆవిష్కృతమైందని కొనియాడారు.
హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు 13 నెలలపాటు ఊచకోత కోస్తూ, మహిళలపై అత్యాచారాలు, దోపిడీలకు పాల్పడుతుంటే ఆనాటి ప్రధాని నెహ్రూ కనీసం స్పందించలేదన్నారు. కానీ పటేల్.. నెహ్రూ మాటలను ఖాతరు చేయకుండా ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సైన్యాన్ని దించి, నిరంకుశ నిజాంను లొంగదీశారని పేర్కొన్నారు. ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ దేశ సమగ్రత, సార్వభౌమాధికారం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు సర్దార్ పటేల్ అని ప్రశంసించారు.
పటేల్ చూపిన సమైక్యతాస్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాహుల్ సరిదెన, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలనలో భారీగా తగ్గిన పేదరికం..
ప్రధాని మోదీ పాలనలో దేశంలో పేదరికం, ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ‘పావర్టీ అండ్ ఈక్విటీ-2026’ నివేదిక ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. దేశంలో 2011–-12లో 27.1 శాతంగా ఉన్న అత్యంత పేదరికం.. 2023-–24 నాటికి ఏకంగా 2.6 శాతానికి పడిపోయిందని, దాదాపు 49.6 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.
2017-23 మధ్య 13.4 కోట్ల ఉపాధి అవకాశాలు రాగా, గ్రామీణ మహిళలు పెద్ద సంఖ్యలో వర్క్‌ఫోర్స్‌లోకి రావడంతో వెనుకబడిన కుటుంబాల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. ఇక ఆదాయ అసమానతలను కొలిచే ‘గినీ సూచీ’లో భారత్ 23 స్కోరు సాధించి అమెరికా (41.8), చైనా (36), జర్మనీ (33.7), బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాల కంటే ఆదాయ సమతుల్యతలో ఎంతో మెరుగైన స్థానంలో నిలిచిందని వివరించారు. సమగ్ర అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
