వెలుగు స్పెషల్ : కలవరమాయే కమలంలో..

వెలుగు స్పెషల్ : కలవరమాయే కమలంలో..

‘పూరిగుడిసెలోదైనా,  దేవుని గుడిలోదైనా  గాలి విసిరికొడితే ఆ దీపముండదు’ అంటాడు ఓ సినీగీతంలో జాలాది.  ఎన్నికల ప్రజావెల్లువ కూడా అటువంటిదే! ఆ భయంతోనే బీజేపీలో కలవరపాటు పెరుగుతోంది.  ‘తమ నేత ఓటమెరగడు’ (ఇన్విన్సిబుల్) అన్న ధీమా నుంచి ‘ఏమో? పరిస్థితులెలా వస్తాయో!’ అన్న సందేహం వరకు నమ్మకం సడలుతున్న సంకేతాలే.  అగ్రనేత మోదీతోపాటు, పార్టీ సిద్ధాంత మాతృక అయిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కలవరం పెరుగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక భేటీ అత్యుత్సాహంపై వీగిన ‘పునర్విభజన’ బిల్లు నీళ్లు చల్లినా... నీట్ పేపర్ లీక్ వ్యతిరేకోద్యమం నుంచే అసలు వెరపు మొదలయింది. 

అర్ధరాత్రి వీడియో రిలీజయినా, ఎర్రకోట నుంచి ‘యువరాగం’అయినా, ‘నిరసన తప్పేం కాదు, జెన్-జీలో నిజాయితీ ఉంది’అన్న నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ వాణి అయినా... ప్రతిస్పందనలే! ‘బొద్దింకలు’ జోరీగల్లా మారి నిద్రలేకుండా చేస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ వ్యతిరేకోద్యమం పుట్టిస్తున్న దడ కలవరపాటుకు పరాకాష్ట. ఇక తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జారుతున్న క్షేత్ర పరిస్థితికి అద్దం.

‘ఎదురు దాడి ఉత్తమ రక్షణ వ్యూహం’ అని అర్థం వచ్చేలా ఆంగ్లంలో ఓ సామెత (అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ డిఫెన్స్) ఉంది. ప్రధాని మోదీ రాజకీయాంశాల్లో అప్పుడప్పుడు ఈ ఎత్తు వేస్తుంటారు. ఆయన స్థాయికి సరిపోకున్నా... దేశంలో అక్కడక్కడ జరిగిన కొన్ని ఎమ్మెల్సీ (పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల) ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దుమ్ము దులిపారు. ‘ఈవీఎం’లను తప్పుబడుతూ బ్యాలెట్ ఎన్నికలు కావాలని గోల చేస్తారు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే జరిగాయి కదా? ‘ఏవీ మీ ఫలితాలు’అని ఎద్దేవా చేశారు. నిజమే, కాంగ్రెస్ గొప్ప ఫలితాలేం సాధించలేదు. 

కానీ, ప్రస్తుత ఫలితాల్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే.... బీజేపీ గాలిపోయిందని తేటతెల్లమవుతోంది. యూపీలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 5 చోట్ల విపక్ష ఎస్పీ నెగ్గింది. ఇది ఎక్కడ? అన్నది కీలకం. స్వయంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో సహా లక్నో వంటి పలు కీలక ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోయింది.  బీజేపీ అధికారంలో ఉన్న యూపీతోపాటు మహారాష్ట్ర, బిహార్ వంటి చోట్ల కూడా చేదు అనుభవాలే! కీలక స్థానాల్లో వ్యతిరేక ఫలితాలొచ్చాయి.  దీంతో ‘బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఏదీ మీ గెలుపు?’ అన్న మోదీ వ్యంగ్య వ్యాఖ్యలకు కాంగ్రెస్ దీటైన సమాధానమిచ్చింది.  ‘మరి  దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పోలింగ్ జరిపించి గెలవండి’ అని పాలకపక్షానికి సవాల్ విసిరింది.

నితిన్ నబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇలాకాలో ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇరవయ్యేళ్లుగా రాజకీయ ప్రాబల్యం ఉన్న పాట్నా (బిహార్)లో  ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. మూడు నెలల కింద జరిగిన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిపై జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్  గెలుపొందాడు.. ఇప్పుడు పాట్నా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. ఐదుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి నవల్ కిశోర్ యాదవ్ ఓడిపోయాడు. 

మరో ‘ఇండియా కూటమి’ పార్టీ అయిన ఆర్జేడీ అభ్యర్థి గెలుపొందాడు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ (మహారాష్ట్ర)లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ గెలిచింది. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) సొంత టౌన్ నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పై కాంగ్రెస్ అభ్యర్థి  విజయం సాధించాడు. ఈ ఎన్నికల్ని బీజేపీ పెద్దగా లక్ష్యపెట్టలేదా? ప్రతికూల ఎన్నికల ఫలితాల సరళికి పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతమా? ఇదే విషయమై పార్టీ బయట, లోపల ఒక చర్చ మొదలయింది.

యూపీపై పట్టు సడలితే కష్టం!

త్వరలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ఢిల్లీ గద్దె (లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ)కు సింహద్వారం వంటి యూపీ (అసెంబ్లీ) ఫలితాల ప్రభావం 2029 సార్వత్రిక ఎన్నికలపై తప్పక ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్సీ ఫలితాలు 6/5 బీజేపీకి చికాకు కలిగించేవే! అది కూడా పట్టున్న, కీలకమైన స్థానాల్లో ఓటమి మింగుడుపడటం లేదు. 2014 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో 71 స్థానాల్లో గెలిచిన బీజేపీ, 2019లో 62కి, 2024లో 33కి పడిపోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 111 స్థానాలకు (403లో) పరిమితమైన ఎస్పీ 2024లో సాధించిన ఫలితాలు ఆషామాషీ  కాదు. 

ఇండియా కూటమి పొత్తుల్లో 62 చోట్ల పోటీచేసి 37 స్థానాల్లో నెగ్గింది.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 6 స్థానాలు దక్కాయి. ఇప్పుడు రాష్ట్రంలో పోటీ జరిగిన 11 టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో 5 చోట్ల నెగ్గిన ఎస్పీ తన స్థానాలు నిలబెట్టుకుంటూ కీలకమైనచోట్ల బీజేపీ స్థానాల్ని కైవసం చేసుకుంది.  ఉపాధ్యాయులు, పట్టభద్రుల్లో పట్టు కోల్పోవడమంటే యువత, విద్యావంతులు, మేధావుల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న సంకేతాల్ని గ్రహించాలి. ఢిల్లీ ఉద్యమాల ప్రభావం యూపీ ఎన్నికల సరళిపై సహజంగానే ఉంటుందన్నది బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియనిది కాదు.  యూపీ అసెంబ్లీ గత ఎన్నికల ముందు ఆ భయంతోనే  వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకొని జాతికి క్షమాపణ చెప్పారు. మరి, ప్రస్తుత ఉద్యమాల భావోద్వేగాలను చల్లబరచడానికి ఏ ఉపశమన చర్యలు చేపడతారో చూడాలి. 
వ్యతిరేకతను అంగీకరించాలి
ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పాలకపక్షాలు అంత తేలికగా అంగీకరించవు. ఉప ఎన్నికల్లోనో, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనో లభించే ప్రతికూల ఫలితాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేర్వేరు కారణాలు, భాష్యాలు చెప్పి, సహజ సంకేతాలను వారు ఖాతరు చేయరు. 2024 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో 62 నుంచి 33కి పడిపోయినప్పుడు, ‘ఇదంతా సిట్టింగ్ ఎంపీలపై వ్యతిరేకత వల్ల జరిగింది’అని బీజేపీ వ్యూహకర్తలు  భాష్యం  చెప్పారు.  రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటుందని, ‘పలకపైన రాతల్ని తుడిపేసినట్టు అభ్యర్థుల్ని భారీగా మార్చాలి’ అని ఇప్పట్నుంచే రాగాలు తీస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా కర్నాటకలో వెల్లడైన ఫలితాల నుంచి సీఎం డీకే శివకుమార్ నేతృత్వపు కాంగ్రెస్ పాఠం నేర్వాలి. రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్ని తెలంగాణలోనూ  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.  ఫలితాలు వికటిస్తే  ‘ఇది నిలవదు, ఓడిపోయే పార్టీ’ అనే భావన జనంలో బలపడితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి  ఎదురీత తప్పదు.  ప్రధాని మోదీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎద్దేవా చేస్తుంటే, ఆగ్రాలో ఓ స్థానిక బీజేపీ కార్యకర్త చేసిన వ్యాఖ్య వాస్తవాన్ని ఎత్తిచూపుతోంది. ‘కాంగ్రెస్ గెలవలేకపోవడం విషయం కాదు, అది పరీక్షలప్పుడు మాత్రమే చదివే విద్యార్థి పరీక్ష తప్పడం లాంటిది, కానీ, ఏడాది పొడవునా చదివే విద్యార్థి పరీక్ష తప్పినంత ఆశ్చర్యం యూపీలో  మా ఎమ్మెల్సీ ఫలితాలు, మేం ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అన్న ఆయన మాట బీజేపీకి గుణపాఠం అవుతుందా?

అలక్ష్యమా? ప్రభ తగ్గడమా!

యువత, ముఖ్యంగా నిరుద్యోగులు, -ఉపాధి అవకాశాలు లభించనివారిలో ప్రధాని మోదీ పట్ల క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందా? అదే జరిగితే గత పుష్కరకాలపు పరిస్థితికి ఇది భిన్నం. ఇటీవలి విద్యార్థి,- యువతరం ఆందోళనల తర్వాత ఇది తరచూ చర్చకు వస్తోంది. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభకు మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానాలలో బీజేపీ ఓటమిపాలయింది.  రక్షణమంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నోలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ నుంచి ఎస్పీ కైవసం చేసుకుంది.  ఎస్పీ  అభ్యర్థి  కాంతి సింగ్,  బీజేపీ అభ్యర్థి అవనీష్ కుమార్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలుపొందారు.  సీఎం యోగి ఆధిత్యనాథ్ సొంతగడ్డ  గోరఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్- ఫైజాబాద్ (అయోధ్య ఉన్నదిక్కడే)లో  బీజేపీకి ఎదురైన గట్టిపోటీ ఒకరకంగా ఎదురుదెబ్బ!  ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో  బీజేపీ అభ్యర్థి  ధ్రువ్ కుమార్ త్రిపాఠి కేవలం 307 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో  గెలిచారు. 

 

- దిలీప్ రెడ్డిపొలిటికల్ ఎనలిస్ట్,
 పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.