అమ్మ దిగులు పడితే.. బిడ్డ బరువు తగ్గుతది..గర్భిణుల మానసిక ఒత్తిడిపై ఎన్ఐఎన్ స్టడీ

అమ్మ దిగులు పడితే.. బిడ్డ బరువు తగ్గుతది..గర్భిణుల మానసిక ఒత్తిడిపై ఎన్ఐఎన్ స్టడీ
  • హైదరాబాద్​లోని 3 బస్తీల్లో 616 మందిపై పరిశోధన
  • ఒత్తిడి స్కోర్ పెరిగే కొద్దీ తగ్గుతున్న శిశువుల బరువు
  • నెలలు నిండని కాన్పులకు ఇది కారణం కాదు
  • గర్భిణులకు మానసిక పరీక్షలూ అవసరమన్న నిపుణులు

 

హైదరాబాద్, వెలుగు: గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, డిప్రెషన్.. పుట్టే బిడ్డ బరువుపై ప్రభావం చూపుతున్నాయని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐలఎన్) అధ్యయనంలో తేలింది. మూడో త్రైమాసికంలో తల్లుల్లో ఒత్తిడి పెరిగే కొద్దీ శిశువుల బరువు తగ్గుతున్నట్లు గుర్తించారు. నెలలు నిండకుండానే కాన్పులు జరగడానికి ఈ ఒత్తిడి కారణం కాదని తేల్చారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌‌తో కలిసి ‘యాక్షన్ అగైనెస్ట్ స్టంటింగ్ హబ్’ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌‌లోని అడ్డగుట్ట, సీతాఫల్‌‌మండి, వారాసిగూడ బస్తీల్లో 616 మంది గర్భిణులపై ఈ పరిశోధన చేశారు. దీని వివరాలు ఇటీవల ‘ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’ జర్నల్‌‌లో ప్రచురితమయ్యాయి.

దేశంలో తక్కువ బరువు జననాలు ఎక్కువ

ప్రపంచవ్యాప్తంగా 14.6 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతుండగా, భారత్‌‌లో ఈ రేటు 17.29 శాతంగా ఉంది. నెలలు నిండకముందే పుట్టే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 9.9 శాతం ఉంటే, మన దేశంలో 13 శాతం ఉన్నారు. పోషకాహార లోపం, రక్తహీనత, చిన్న వయసులో గర్భం దాల్చడం వంటి కారణాలతో పాటు తల్లి మానసిక పరిస్థితి కూడా పిండం ఎదుగుదలపై ప్రభావం చూపుతుందా? అనే అంశాన్ని పరిశోధకులు పరిశీలించారు. తీవ్రమైన ఒత్తిడి వల్ల శరీరంలోని హైపోథలామిక్ పిట్యూటరీ అడ్రినల్ (హెచ్‌‌పీఏ) వ్యవస్థ ఉత్తేజితమై కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మాయ ద్వారా పిండానికి అందే రక్తప్రసరణ, పోషకాల సరఫరాకు ఆటంకం కలగొచ్చనే సూత్రం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.

ఎలా చేశారంటే..

ఎన్ఐఎన్ సైంటిస్టులు జేమ్స్ థామస్, డాక్టర్ రవీంద్రనాథ్ పాలికా నేతృత్వంలోని బృందం 2021 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఈ స్టడీ చేసింది. మూడో త్రైమాసికంలో ఉన్న 717 మంది గర్భిణులను ఎంపిక చేసి, గత కాన్పుల్లో తీవ్రమైన సమస్యలు, డయాబెటిస్ ఉన్నవారిని మినహాయించి 616 మంది వివరాలను విశ్లేషించారు. పీఎస్ఎస్–10 స్కేల్‌‌తో ఒత్తిడిని, ఈపీడీఎస్‌‌తో డిప్రెషన్ లక్షణాలను, ఎంఎస్పీఎస్ఎస్‌‌తో కుటుంబం నుంచి అందుతున్న సహకారాన్ని అంచనా వేశారు. తొలి త్రైమాసికంలో అల్ట్రాసౌండ్‌‌తో గర్భధారణ కాలాన్ని నిర్ధారించి, ప్రసవమైన 12 గంటల్లోపు డిజిటల్ త్రాసుతో శిశువుల బరువును నమోదు చేశారు.

ఒక్క పాయింట్‌‌కు 5.84 గ్రాములు

స్టడీలో 17.4 శాతం మంది గర్భిణుల్లో తీవ్ర ఒత్తిడి, 21.4 శాతం మందిలో డిప్రెషన్ లక్షణాలు కనిపించాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే ఈ రేట్లు తక్కువగా ఉండడానికి బలమైన కుటుంబ వ్యవస్థే కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. 97.9 శాతం మంది మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించినట్లు గుర్తించారు. తల్లి వయసు, చదువు, ఆహారం, గత కాన్పుల సంఖ్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 562 మంది వివరాలను విశ్లేషించారు. ఒత్తిడి స్కోర్‌‌లో ఒక్క పాయింట్ పెరిగితే శిశువు బరువు సగటున 5.84 గ్రాములు, డిప్రెషన్ స్కోర్‌‌లో ఒక్క పాయింట్ పెరిగితే 7.45 గ్రాములు తగ్గుతున్నట్లు తేలింది. అయితే ఈ ప్రభావం బరువు తగ్గుదలకే పరిమితమైంది. నెలలు నిండకముందే కాన్పు జరగడం, లేదా 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ముప్పు 
పెరగడం కనిపించలేదు.

మానసిక ఆరోగ్యానికీ పరీక్షలు

స్టడీలో పాల్గొన్నవారిలో 79.6 శాతం మంది 18 నుంచి 29 ఏండ్ల లోపువారే. 47.8 శాతం కాన్పులు సిజేరియన్ ద్వారా జరిగాయి. కరోనా సమయంలో పరిశోధన జరగడం, మూడో త్రైమాసికంలో ఒక్కసారే మానసిక పరిస్థితిని అంచనా వేయడం, గర్భధారణకు ముందు తల్లి బీఎంఐ వివరాలు లేకపోవడం వంటివి ఈ స్టడీకి ఉన్న పరిమితులని పరిశోధకులు తెలిపారు. అయినా తల్లి మానసిక ఆరోగ్యం శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుందనడానికి ఈ ఫలితాలు సంకేతమని చెప్పారు. గర్భిణులకు మానసిక ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైనవారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచొచ్చని సూచించారు.