హైదరాబాద్, వెలుగు: భూ ఆక్రమణలు బయటకు తీస్తే కల్వకుంట్ల కుటుంబం గిలగిలా కొట్టుకుంటున్నదని విప్ అద్దంకి దయాకర్ అన్నారు. ప్రపంచంలోనే ఎవరూ దోచుకోనంతగా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. శనివారం ఆయన సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ కన్నా ముందు నుంచి కొనసాగుతున్న నేతల ఆస్తులు పెరగనప్పుడు.. తెలంగాణ వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబం ఆస్తులే ఎలా పెరిగాయని ప్రశ్నించారు.
ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్.. కొడుకు, అల్లుడితో రాజకీయ రచ్చ చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం చేతకాని కల్వకుంట్ల కుటుంబం చేవలేని రాజకీయాలు చేస్తుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం భూ భాగోతాలు బయటపెట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని, వారు ఎన్ని కుట్రలు చేసినా ఆయన కుటుంబం ఎలాంటి తప్పుచేయలేదు కాబట్టి ఏమీ చేయలేరన్నారు.
