- పీఎంశ్రీ స్కూళ్ల రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్‌కు అనూహ్య స్పందన
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రతిభ కనబరిచిన పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులతో శనివారం హైదరాబాద్‌లోని గోదావరి హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమగ్ర శిక్ష ఏఎస్పీడీ పీవీ శ్రీహరి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పార్లమెంటరీ కార్యకలాపాలు, వాక్చాతుర్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. మాక్ పార్లమెంట్లో విద్యార్థులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రతిపక్ష నాయకుల పాత్రలను అద్భుతంగా పోషించారు. పార్లమెంట్ సభా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చలు, ప్రశ్నోత్తరాలతో సభను రక్తికట్టించారు.
ముఖ్యంగా వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావం – పరిష్కారాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, విద్యార్థులపై డిజిటల్ వినియోగ ప్రభావం, ఆహార భద్రత వంటి కీలక అంశాలపై చర్చించారు. ప్రజా సమస్యలు, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉత్పత్తి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై మంత్రుల పాత్రల్లో ఉన్న విద్యార్థులు వివరణలు ఇస్తూ పరిష్కార మార్గాలను సూచించారు.
