క్రాప్ హాలిడే ప్రకటించలె.. ప్రతిపక్షాలు చేస్తున్నది తప్పుడు ప్రచారం: మంత్రి తుమ్మల

క్రాప్ హాలిడే ప్రకటించలె.. ప్రతిపక్షాలు చేస్తున్నది తప్పుడు ప్రచారం: మంత్రి తుమ్మల
  • ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నం
  • ఆరు నెలలుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
  • ఎప్పట్లాగే  సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్నం
  • వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో వారిని ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు.

ప్రభుత్వం ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పంటల ఎంపికపై సూచనలు చేస్తున్నామని మంత్రి తుమ్మల చెప్పారు. ఎల్‌‌నినో ప్రభావంతో  సరిపడా నీరు అందుబాటులో లేనందున రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆరుతడి, సమీకృత పంటల సాగును ప్రోత్సహిస్తున్నదని, ఈ విషయంలో ఆరు నెలలుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.

సబ్సిడీపై విత్తనాలు 

ఎల్‌‌నినో అనేది ఒక్క తెలంగాణకే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నదని మంత్రి స్పష్టం చేశారు.  కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధిక నీరు అవసరమయ్యే పంటల సాగు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట చివరి దశలో నీటి కొరత ఏర్పడి పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి రాకుండా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేయాలని కోరారు. ఈమేరకు వ్యవసాయ అధికారులు రైతు వేదికల్లో  క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా పంటల ఎంపిక, విత్తనాల లభ్యత, నీటి వినియోగంపై సూచనలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎప్పట్లాగే ఆరుతడి పంటల విత్తనాలను సైతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని మంత్రి తుమ్మల వివరించారు.

వారానికోసారి వాతావరణ సమాచారం

ప్రాంతాలవారీగా వాతావరణ పరిస్థితులు, వర్షపాతం అంచనాలు, భూగర్భ జలాల మట్టాలకు సంబంధించిన సమాచారాన్ని  రైతులకు ప్రతి వారం చేరవేస్తున్నామని తుమ్మల తెలిపారు. 'రైతునేస్తం' కార్యక్రమం ద్వారా వ్యవసాయ నిపుణులతో పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎంచుకోవాలని మంత్రి సూచించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. 

ఇప్పటికే వానాకాలంలో సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రస్తుతం పలు పంటలకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరలు లభిస్తున్నాయని మంత్రి తెలిపారు. కరువు పరిస్థితుల్లో పంట నష్టాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.

ఆయిల్‌‌పామ్ సాగుకు ప్రోత్సాహం

వాతావరణ మార్పుల నేపథ్యంలో దీర్ఘకాలికంగా రైతులకు మెరుగైన ఆదాయం అందించే పంటలపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇందులో భాగంగా ఆయిల్‌‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. నాణ్యమైన మొక్కలు సకాలంలో అందుబాటులో ఉండేలా కంపెనీల నర్సరీల్లో ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. నవంబర్‌‌లో 10.99 లక్షలు, డిసెంబర్‌‌లో 6.19 లక్షలు, జనవరిలో 5.20 లక్షలు, ఫిబ్రవరిలో 4.65 లక్షలు, మార్చిలో 4.18 లక్షల ఆయిల్‌‌పామ్ మొక్కలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతోపాటు వాతావరణ ప్రతికూలతల నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.