బ్యాలెట్ తోన   ఎన్నికలకు  పోదాం..ఈసీని ఒప్పించే  బాధ్యత  నాది: కేంద్రమంత్రి బండి సంజయ్

బ్యాలెట్ తోన   ఎన్నికలకు  పోదాం..ఈసీని ఒప్పించే  బాధ్యత  నాది: కేంద్రమంత్రి బండి సంజయ్
  • దమ్ముంటే సర్కార్‌‌‌‌ను రద్దు చేసి రండి
  • సీఎంకు కేంద్ర మంత్రి బండి సవాల్
  • 13 కోట్ల ఓట్ల తొలగింపు పచ్చి అబద్ధం
  • త్వరలో దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ తెస్తం
  • సీఈసీపై అభిశంసన అంటే పెద్ద జోక్

 

హైదరాబాద్, వెలుగు: ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలకు వెళ్దామని, ఇందుకు ఎన్నికల సంఘాన్ని ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రాష్ట్రంలో కరువు, పంటల ఎండిపోవడం, రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం.. ఆరు గ్యారంటీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఢిల్లీ ధర్నాలు, ఈవీఎంలు, ‘సర్’ అంశాలను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులున్నా 365 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం దారుణమన్నారు. అనేక చోట్ల తాగు, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్​పై ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొడుతూ రాసిన ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. అరాచకాన్ని తరిమికొడదాం’ పుస్తకాన్ని శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.

ఓట్ల తొలగింపు ప్రచారం అబద్ధం

దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారన్న కాంగ్రెస్ ప్రచారం అసత్యమని బండి సంజయ్ అన్నారు. అవి కేవలం ముసాయిదా జాబితాలేనని చెప్పారు. పొరపాటున అర్హుల ఓట్లు తొలగితే తగిన ఆధారాలు సమర్పించి తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. 2004లో మరణించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఓటు ఇప్పటికీ జాబితాలో ఉందని, దాన్ని తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌పై కాంగ్రెస్ విమర్శలు చేయడం, అభిశంసన తీర్మానం తీసుకొస్తామనడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్యసమితికి వెళ్లి ఫిర్యాదు చేసినా ఎదుర్కొంటామని అన్నారు. ‘సర్’ ప్రక్రియను ఆపే ప్రసక్తే లేదని, కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేసి అక్రమ చొరబాటుదారులను తరిమేస్తామన్నారు. బంగ్లాదేశ్ తరహాలో భారత్‌‌లో అల్లర్లు సృష్టించి మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ‘ఐసా’ నేత నేహా బోరా, పాకిస్తాన్ నిధులతో పనిచేస్తున్న సీజేపీ నాయకుడు అశుతోష్ రంకా, విదేశీ నిధులతో పార్టీ ఏర్పాటు చేశారని పేర్కొన్న అభిజీత్ దీప్కేలతో కలిసి కాంగ్రెస్ ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో మల్క కొమరయ్య, అంజిరెడ్డి పాల్గొన్నారు.