ఐదు రోజులు వానలు.. తెలంగాణ అంతటా వర్షాలు కురిసే అవకాశం

ఐదు రోజులు వానలు..  తెలంగాణ అంతటా వర్షాలు కురిసే అవకాశం
  • బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం
  • గంటకు 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
  • నవంబర్, డిసెంబర్‌‌‌‌లో వేసవిలా ఎండలు 
  • రెడ్ జోన్‌‌‌‌లో 10 జిల్లాలు.. చలి జాడ ఉండదు
  • ‌‌‌‌‌‌‌‌ వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ

 

హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారే చాన్స్​ ఉందని, దాని ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ వానల తర్వాత మాత్రం ఎండలు మండిపోతాయని హెచ్చరించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎల్‌‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, తెలంగాణ సహా దక్షిణాదిలో సగటు కంటే 77 శాతం తక్కువ వర్షాలు పడతాయని తన నవంబర్ ఔట్‌‌లుక్‌‌లో పేర్కొంది. ఉత్తర, మధ్య తెలంగాణలోని 10 జిల్లాలను రెడ్ జోన్‌‌లో పెట్టింది. చలికాలంలోనూ చలి తీవ్రత ఉండదని స్పష్టం చేసింది.

ఐదు రోజులు వానలు

ఆదివారం, సోమవారం రాష్ట్రమంతటా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ సిటీలోనూ వానలు పడతాయని వెల్లడించింది. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, మరికొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

నవంబర్, డిసెంబర్‌‌లో తీవ్ర ఎండ 

రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ నవంబర్ ఔట్‌‌లుక్‌‌లో వెల్లడించింది. హిమాలయ రాష్ట్రాలు తప్ప దేశమంతటా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించింది. మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌‌కాస్ట్ సిస్టమ్, అంతర్జాతీయ వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం నవంబర్, డిసెంబర్‌‌లో ఎల్‌‌నినో ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, ఈ 10 జిల్లాలను రెడ్ జోన్‌‌లో పెట్టింది.

రాత్రుళ్లూ వేడే

ఈసారి చలి తీవ్రత ఉండదని ఐఎండీ స్పష్టం చేసింది. ములుగు జిల్లా తప్ప రాష్ట్రమంతటా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. ఉమ్మడి మహబూబ్‌‌నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రాత్రుళ్లు కూడా వేడిగానే ఉంటాయని, ఆ జిల్లాలను కూడా రెడ్ జోన్‌‌లో చేర్చింది.