న్యూఢిల్లీ: దేశంలో చాలా సంవత్సరాలుగా ఓట్ చోరీ జరుగుతోంది.. ఆ ఓట్ చోరీతోనే బీజేపీ అధికారాన్ని చోరీ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. మింటో రోడ్ నుంచి మొదలై, కన్నాట్ ప్లేస్ మీదుగా రామ్‌లీలా మైదానం వరకు మార్చ్ కొనసాగింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘హిందుస్థాన్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కొన్నేళ్లుగా దేశంలో ఓటుచోరీగా జరుగుతోంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కలిసి భారీ కుట్రకు పాల్పడ్డారు. సర్ పేరిట దేశంలో ఏకంగా 13.5 కోట్ల ఓట్లు తొలగించారు.
2024 పార్లమెంట్ ఎన్నికల ముందు 15 శాతం బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ-యూపీఏ మధ్య ఓట్ల అంతరం 3 శాతం మాత్రమే. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. బీజేపీతో కలిసి మోడీ వ్యతిరేక ఓట్లను సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగిస్తు్న్నాడు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ చేసిన నేరం చిన్నది కాదు. ఓటు ద్వారా ప్రజలు తమ అభిప్రాయం చెప్పే అవకాశం లేకుండా చేశారు. జ్ఞానేష్ కుమార్ జైలుకు వెళ్లాల్సిందే.
జ్ఞానేష్ కుమార్ తర్వాత మోడీ వంతు వస్తోంది. మోడీని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతిభారతీయుడికి స్పష్టం చెబుతున్నా.. జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి దిగిపోతారు. జ్ఞానేష్ కుమార్ చేసిన నేరం ఆయన్ను నిద్ర పోనివ్వట్లేదు. జ్ఞానేష్ కుమార్ లేకుండా మళ్లీ మోడీ ప్రధాని, అమిత్ షా హోం మంత్రి కాలేరు.
ఓట్ చోరీతోనే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. బెంగాల్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచింది. బీజేపీ పన్నెండేళ్ల పాలనలో ఏ వర్గానికైనా మేలు జరిగిందా..? యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు ఆదాయం లేదు. మోడీ పాలన అదానీ ఆమ్దానీ వస్తే చాలన్నట్లుగా ఉంది.
మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని అదానీకి అమ్ముతున్నారు. టెలికం, పోర్టులు, బ్యాంకులు అన్నింటినీ అదానీ చేతిలో పెట్టారు. ప్రజలకు చెందిన దర్యాప్తు సంస్థలన్నీ మోడీ, ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్లాయి. జరుగుతోన్న అన్యాయంపై భారత ప్రజలు శివతాండవం చేయాలి’’ అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
