* కబడ్డీని ఒలింపిక్స్‌లో చేర్చడమే లక్ష్యం
* త్వరలో కబడ్డీ వరల్డ్ కప్, మహిళల ప్రీమియర్ లీగ్
* ఐకేఎఫ్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
Kabaddi: హైదరాబాద్, నవంబర్ 1: కబడ్డీ క్రీడాను 2036 ఒలింపిక్స్‌లో చేర్చడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (IKF) పని చేస్తోందని ఫెడరేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా కబడ్డీకి చోటు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు (2026, నవంబర్ 1, ఆదివారం) హైదరాబాద్‌లోని కసాని గ్రాండ్ హోటల్లో కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కబడ్డీని ఒలింపిక్స్‌లో చేర్చడమే లక్ష్యం:
కబడ్డీని ఒలింపిక్స్‌లో చేర్చడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు మరింత గుర్తింపు లభించడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తాయని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. అన్ని దేశాలు కబడ్డీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీకి మరింత ఆదరణ పెంచేందుకు త్వరలో కబడ్డీ వరల్డ్ కప్ నిర్వహించడంతో పాటు మహిళల కబడ్డీ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ కప్ నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న దేశాలు తమ ప్రతిపాదనలు, వివరాలను సమర్పించాలని కోరామని, ఆయా దేశాల ఆసక్తిని పరిశీలించిన తర్వాత వేదికను ఖరారు చేస్తామని వెల్లడించారు.
►ALSO READ | తుక్కురేగొట్టిన సీఫెర్ట్.. భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
మహిళల కబడ్డీ లీగ్‌ని నిర్వహిస్తాం:
పురుషుల కబడ్డీ ప్రో గేమ్స్‌కు మంచి ఆదరణ లభించిందని, అదే స్ఫూర్తితో మహిళల కబడ్డీ లీగ్‌లను కూడా నిర్వహించి మహిళా క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తామని కాసాని జ్ఞానేశ్వర్ తెలియజేశాడు. ప్రస్తుతం 62 దేశాలు కబడ్డీలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయని, ఆయా దేశాలు ఐకేఎఫ్లో సభ్యత్వం పొందాయని చెప్పుకొచ్చారు. కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన వసతులు, నాణ్యమైన శిక్షణ, ప్రోత్సాహకాలు అందించేందుకు ఫెడరేషన్ అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ మీటింగ్ లో డైరెక్టర్లు వెంకటేశ్ బండారి, గోవింద్ నారాయణ్ శర్మతో పాటు వివిధ దేశాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఒసామా, శర్మ తదితరులు పాల్గొన్నారు.
