Balakrishna Remuneration: బాలయ్య నెక్స్ట్ మూవీకి భారీ రెమ్యునరేషన్.. కొరటాల శివ మూవీకి ఇన్ని కోట్లా?

Balakrishna Remuneration: బాలయ్య నెక్స్ట్ మూవీకి భారీ రెమ్యునరేషన్.. కొరటాల శివ మూవీకి ఇన్ని కోట్లా?

నందమూరి బాలకృష్ణ (Balakrishna).. ఈ పేరు వినిపిస్తే చాలు.. థియేటర్లలో మాస్ జాతర గుర్తొస్తుంది. పవర్‌ఫుల్ డైలాగులు, విజిల్స్ వేయించే యాక్షన్ సీన్లు, బాక్సాఫీస్ దగ్గర బాలయ్య మార్క్.. ఇవన్నీ ఆయన సినిమాలకు ప్రత్యేక క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు రూ.కోట్లలో ఉన్న ఆయన పారితోషికం.. ఇప్పుడు భారీ స్థాయికి చేరిందనే చర్చ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాల తర్వాత బాలయ్య మార్కెట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు వరుసగా కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో దాదాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో కలిసి మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే NBK112గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. 

అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలైంది. వరుస సినిమాలు, పెరుగుతున్న మార్కెట్, భారీ బడ్జెట్ ప్రాజెక్టుల నేపథ్యంలో బాలయ్య తన నెక్స్ట్ సినిమాకి తీసుకోబోతున్న పారితోషికంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కెరీర్‌లోనే సరికొత్త రికార్డు సృష్టించే స్థాయిలో రెమ్యునరేషన్ ఉండబోతోందా? అంటే.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మరి కొరటాల శివ సినిమాతో బాలయ్య పారితోషికం ఏ రేంజ్ లో ఉండనుందో ఓ లుక్కేద్దాం..

NBK112తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్..

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్య ఏకంగా రూ.45 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే నిజమైతే, బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తంపై చిత్ర బృందం నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

బాలయ్యతో కొరటాల.. బడ్జెట్ కూడా భారీగానే!

మాస్ హీరో బాలకృష్ణకు, కమర్షియల్ సినిమాలతో పాటు బలమైన సామాజిక అంశాలను తెరపై చూపించే దర్శకుడు కొరటాల శివ తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ కాంబినేషన్‌లో ఎలాంటి కథను తెరకెక్కించబోతున్నారనే చర్చ సాగుతోంది. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా కోసం హీరోతో పాటు దర్శకుడి పారితోషికం కూడా గట్టిగానే ఉండబోతోందని కథనాలు పేర్కొంటున్నాయి. మరి కొరటాల శివ ఈ సినిమా కోసం రూ.40 కోట్ల పారితోషికం తీసుకోనున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ఇందులో నిజమెంత అనేది మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది..

క్రిస్మస్ బరిలోకి ‘దాదా’..

బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దాదా’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను సరికొత్త మాస్ అవతార్‌లో చూపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ‘దాదా’ చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా క్రిస్మస్ బాక్సాఫీస్ పోటీలో నిలవనుంది. 

స్టోరీ బ్యాక్ డ్రాప్.. గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్య?

‘దాదా’ టైటిల్ గ్లింప్స్‌లో బాలకృష్ణను రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో చూపించారు. లెదర్ జాకెట్, గోల్డ్ చైన్, చేతిలో ఆయుధంతో ఆయన కనిపించిన తీరు సినిమా యాక్షన్ ప్రధానంగా సాగనుందనే అంచనాలను పెంచింది. గ్లింప్స్‌లో పోలీసులతో బాలయ్య పాత్రకు మధ్య వచ్చే సంభాషణ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ విజువల్స్‌ను బట్టి ఆయన పాత్రలో గ్యాంగ్‌స్టర్ ఛాయలు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే సినిమా పూర్తి కథ, బాలకృష్ణ క్యారెక్టర్ గురించి యూనిట్ సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం టాకీ పార్ట్స్‌తో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణపై చిత్ర బృందం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

భారీ అంచనాల మధ్య ‘దాదా’..

‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. బాలయ్యను కొత్త లుక్‌లో చూపిస్తూ విడుదల చేసిన గ్లింప్స్, యాక్షన్ ప్రధానంగా కనిపిస్తున్న విజువల్స్ సినిమాపై హైప్ పెంచాయి. మరి ‘దాదా’తో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారు? గోపీచంద్ మలినేని ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకులను మెప్పిస్తారు? డిసెంబర్ 24న ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.