యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం.. ఆ పార్టీ పతనం ఇక్కడి నుంచే: అఖిలేష్ యాదవ్

యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం.. ఆ పార్టీ పతనం ఇక్కడి నుంచే: అఖిలేష్ యాదవ్

న్యూఢిల్లీ: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. బీజేపీ పతనం యూపీ నుంచే మొదలు అవుతుందని అన్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. మింటో రోడ్ నుంచి మొదలై, కన్నాట్ ప్లేస్ మీదుగా రామ్‌లీలా మైదానం వరకు మార్చ్ కొనసాగింది. 

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు ఈ మార్చ్‎లో పాల్గొన్నారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రజల మద్దతుతో కాకుండా ఎన్నికల సంఘం సహకారంతో గెలుస్తోందని ఆరోపించారు. 

ఓట్ చోరీకి ప్రత్యక్షంగా పాల్పడిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్‎ను కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ్ బెంగాల్‏లో బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చిందని.. బెంగాల్‏లో పాటించిన విధానాన్నే దేశమంతా అమలు చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. 

ఉత్తరప్రదేశ్‎లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజలను భయపెట్టి ఓటు వేయకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో సర్ పేరిట ఒక్క యూపీలోనే 1.17 కోట్ల ఓట్లు తొలగించారని చెప్పారు. 

డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీలో అభివృద్ధి శూన్యమన్నారు.  యూపీలో బీజేపీ అంగదుడి పాదంలా గట్టిగా పాతుకుపోయిందన్న అమిత్ షా వ్యాఖ్యలకు ఈ సందర్భంగా అఖిలేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు నేలనే లేకపోతే అంగదుడు తన పాదాన్ని ఎక్కడ పెడతాడని ఎద్దేవా చేశారు.