టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ బాక్సాఫీస్ దగ్గర తన జోరు చూపిస్తోంది. అక్టోబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. రెండో రోజు వసూళ్లలో మంచి రెస్పాన్స్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే కలెక్షన్లు పెరగడం, థియేటర్లలో ఆక్యుపెన్సీ మెరుగుపడటంతో వెంకీ మామ సినిమా వీకెండ్ రేసులో పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి రెండు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూలు చేసింది? బాక్సాఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఏంటి? అనే వివరాలు చూద్దాం..
రెండో రోజుతో ఊపందుకున్న వసూళ్లు
‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు మంచి జోరు చూపించింది. తొలి రోజు ఇండియాలో రూ.9.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. శనివారం రూ.10.40 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే వసూళ్లలో 6.7 శాతం గ్రోత్ నమోదైంది. ఈ క్రమంలో AK 47 మూవీ ఇండియాలో రెండు రోజులకు కలిపి రూ.20.15 కోట్ల నెట్, రూ.23.60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ కలెక్షన్లను కూడా కలుపుకొని వరల్డ్‌వైడ్‌గా రూ.33.95 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు, రెండో రోజు థియేటర్లలో ఆక్యుపెన్సీ సైతం మెరుగుపడింది. ఫస్ట్ డే 44.1 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ.. సెకండ్ డే 48.1 శాతానికి చేరింది. ముఖ్యంగా నైట్ షోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక ఆదివారం హాలిడే కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడితే కలెక్షన్లలో మరింత జోరు కనిపించే అవకాశం ఉంది. రెండో రోజు పెరిగిన వసూళ్లు వెంకీ మామ సినిమాకు కొంత బూస్ట్ ఇచ్చాయి. మరి ఈ వీకెండ్ జోరును ఆదివారం కూడా కంటిన్యూ చేసి బాక్సాఫీస్ దగ్గర మరిన్ని మంచి నంబర్లు నమోదు చేస్తాడేమో చూడాలి..
ఆదివారం వసూళ్లపైనే అందరి చూపు
శనివారం వసూళ్లలో కనిపించిన పెరుగుదల వెంకటేష్ సినిమాకు కొంత ఊరటనిచ్చింది. ఇప్పుడు ఆదివారం సెలవు రోజు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎంతమేరకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోమవారం నుంచి వసూళ్లు నిలకడగా కొనసాగితేనే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని తట్టుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి, ‘ఆదర్శ కుటుంబం’కు రెండో రోజు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు బలాన్ని ఇచ్చింది. అయితే, వెంకీ మామ నిజంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాలంటే వీకెండ్ జోరును వర్కింగ్ డేస్‌లోనూ కొనసాగించాల్సి ఉంటుంది. అభిమానుల అంచనాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ, మౌత్ టాక్.. ఈ మూడు అంశాలే సినిమా వసూళ్లను డిసైడ్ చేస్తుంది..
