తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు సిద్దిపేటకు బదిలీ కావడంతో సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును క్రైమ్ నంబర్ 496/2026గా నమోదు చేశారు.
గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1205/2024గా నమోదైన ఈ కేసులో తాజాగా మరికొన్ని సెక్షన్లను జోడించారు. పాత ఎఫ్‌ఐఆర్‌తో పోలిస్తే కొత్త ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా ఆరు సెక్షన్లు చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీసీ 419, 420, 467, 406 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 66C, 66D సెక్షన్లను కొత్త ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.
కొత్త ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల జాబితాలో ఏ1గా తన్నీరు హరీశ్ రావు, ఏ2గా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పేర్లను పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరి పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు సమాచారం.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌తో పాటు తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారంటూ చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2024 డిసెంబర్ 1న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా, అప్పట్లో కేసు నమోదు చేశారు.
తాజాగా కేసు సిద్దిపేటకు బదిలీ కావడంతో అక్కడి వన్‌టౌన్ పోలీసులు కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై సిద్దిపేట పోలీసుల పరిధిలో విచారణ కొనసాగనుంది.
