ధంతేరస్, దీపావళి పండగలు దగ్గరపడుతున్నాయంటే మార్కెట్లలో సందడి మొదలవుతుంది. ముఖ్యంగా ఈ పండగల సమయంలో కొత్త వస్తువులు, బంగారం, వాహనాలు కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. మీరు కూడా ఈ దీపావళి లేదా ధంతేరస్ సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకో శుభవార్త !
2026 పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని బ్యాంకులు కస్టమర్లకు ఆకర్షణీయమైన కార్ లోన్ ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులపై తగ్గింపులు, లోన్ ముందుగానే క్లోజ్ చేసేటప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోవడం వంటి ప్రయోజనాలను కల్పిస్తున్నాయి.
ముఖ్యంగా ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కోటక్ మహీంద్రా బ్యాంక్, HDFC బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు కార్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. మరి ఏ బ్యాంకులో ఎంత వడ్డీకి కారు లోన్ లభిస్తోంది? ఏ బ్యాంకు ద్వారా లోన్ తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ? పూర్తి వివరాలు తెలుసుకుందామా......
ఏ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు ఎంత?
పండుగ సీజన్‌లో కారు కొనాలనుకునే వారికి వడ్డీ రేటు చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తీసుకునే లోన్‌పై వడ్డీ ఎక్కువగా ఉంటే ప్రతినెలా EMI భారం పెరుగుతుంది. అదే తక్కువ వడ్డీకి లోన్ లభిస్తే కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొన్ని ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న కార్ లోన్ ఆఫర్లు ఇలా ఉన్నాయి.
1. ఇండియన్ బ్యాంక్
పండుగ సీజన్‌లో తక్కువ వడ్డీకి కార్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇండియన్ బ్యాంక్ మంచి ఆపాశం లాగ కనిపిస్తోంది. ఈ బ్యాంకు 7.75 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో కార్ లోన్లను అందిస్తోంది. ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. సాధారణంగా బ్యాంకులు లోన్ మంజూరు చేసే సమయంలో ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ ఈ ఆఫర్‌లో ఆ ఛార్జీలు లేకపోవడంతో కస్టమర్లకు కొంత డబ్బు ఆదా అవుతుంది. ప్రత్యేక ప్రయోజనాలు ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు సున్నా కాబట్టి లోన్ తీసుకునే సమయంలో అదనపు ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కార్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. SBIలో కార్ లోన్ వడ్డీ రేటు 8.70 శాతం నుంచి ప్రారంభమవుతోంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజుపై ప్రత్యేక రాయితీ కూడా ఇస్తుంది. దీంతో కొత్త కారు కొనే సమయంలో లోన్ తీసుకునే కస్టమర్లకు కొంత ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ప్రత్యేక ప్రయోజనాలు చూస్తే ప్రాసెసింగ్ ఫీజుపై ప్రత్యేక తగ్గింపు లేదా మినహాయింపు కల్పిస్తుంది.
3. కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఈ పండుగ సీజన్‌లో కార్ లోన్ తీసుకునే వారికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బ్యాంకులో ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే సాధారణంగా కట్టాల్సిన ప్రాసెసింగ్ ఫీజులో సగం మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, లోన్‌ను ముందుగానే పూర్తిగా కట్టినప్పుడు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండవని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రయోజనాలు ఏంటంటే అవసరాన్ని బట్టి లోన్‌ను ముందుగానే క్లోజ్ చేసుకునే వెసులుబాటు. ఉంది
4. HDFC బ్యాంక్
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకు HDFC కూడా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆకర్షణీయమైన కార్ లోన్ సదుపాయాలను అందిస్తోంది. ఈ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 8.25 శాతం నుంచి ప్రారంభమవుతోంది. అంతేకాకుండా గరిష్టంగా 8 సంవత్సరాల వరకు లోన్ తిరిగి చెల్లించేందుకు అవకాశం కల్పిస్తోంది.
దీంతో ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకునే వారికి EMIని ఎక్కువ కాలానికి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే 8 సంవత్సరాల వరకు లోన్ ముందుగానే క్లోజ్ చేస్తే ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండవని చెబుతోంది.
కార్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!
ధంతేరస్, దీపావళి వంటి పండుగల సమయంలో కొత్త కారు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే చాలామంది ఈ సమయంలోనే వాహనం కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే పండుగ ఆఫర్లు ఉన్నాయని తొందరపడి లోన్ తీసుకోవడం మంచిది కాదు.
కార్ లోన్ తీసుకునే ముందు పరిశీలించాల్సినవి :
1. వడ్డీ రేటును పోల్చి చూడండి: ఒకే బ్యాంకులో అందరికీ ఒకే వడ్డీ రేటు ఉండకపోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, ఉద్యోగం, లోన్ మొత్తం వంటి అంశాల ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల ఆఫర్లను పోల్చి చుడండి.
2. EMI ఎంతో ముందే తెలుసుకోండి: ప్రతి నెలా మీరు ఎంత EMI చెల్లించాల్సి వస్తుందో ముందుగానే లెక్కించుకోండి. మీ నెల ఆదాయానికి తగినట్లుగా EMI ఉండేలా చూసుకోండి.
3. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు: వడ్డీ రేటు తక్కువగా ఉందని మాత్రమే లోన్ తీసుకోకండి. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇతర ఖర్చులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించండి.
4. లోన్ కాలపరిమితిని జాగ్రత్తగా ఎంచుకోండి: ఎక్కువ సంవత్సరాలకు లోన్ తీసుకుంటే ప్రతినెల EMI తగ్గవచ్చు. కానీ మొత్తం మీద కట్టే వడ్డీ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు అనుకూలమైన కాలపరిమితిని ఎంచుకోండి.
5. ఫోర్‌క్లోజర్ నిబంధనలు తెలుసుకోండి: లోన్ పూర్తయ్యేలోపు మీ దగ్గర డబ్బు ఉంటే ముందుగానే మొత్తం కట్టేసుకోవచ్చు. అలాంటప్పుడు అదనపు ఛార్జీలు ఉంటాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోండి.
