రెస్టారెంట్‌కు వెళ్లామంటే హాయిగా కూర్చొని ఇష్టమైన ఫుడ్ ఆస్వాదించాలని అనుకుంటాం... తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలన్నా, శుభ్రత పాటించాలన్నా అందుకు తగిన సౌకర్యాలు కూడా రెస్టారెంట్లలో ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం ఉన్న సౌకర్యాలను ఉపయోగించకుండా వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా సింగపూర్‌లో జరిగిన ఓ సంఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. అక్కడ ఓ కస్టమర్ రెస్టారెంట్‌లో వాష్‌బేసిన్ ఉన్న, ఏకంగా అతను భోజనం చేస్తున్న టేబుల్ పక్కనే చేతులు కడుక్కోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి చేసిన పనికంటే, అతని పక్కనే కూర్చున్న మహిళ స్పందించిన తీరు, అలాగే రెస్టారెంట్ సిబ్బందికి ఎదురైన ఇబ్బందులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వాష్‌బేసిన్ పక్కనే ఉన్నా కూడా..
సింగపూర్‌కు చెందిన DK Signatures అనే రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి తనతో పాటు వచ్చిన మహిళతో కలిసి భోజనం చేస్తున్నాడు. అయితే భోజనం చేస్తున్న సమయంలో అతను చేతులు కడుక్కోవాలని అనుకున్నాడు. ఇందుకోసం రెస్టారెంట్‌లో ప్రత్యేకంగా వాష్‌బేసిన్ ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడికి వెళ్లకుండా అతను కూర్చున్న డైనింగ్ టేబుల్ పక్కనే చేతులపై నీళ్లు పోస్తూ కడుక్కోవడం ప్రారంభించాడు.
అతను చేతులు కడుక్కోవడంతో నీళ్లన్నీ కింద నేలపై పడిపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతను కూర్చున్న ప్రదేశానికి కొద్ది అడుగుల దూరంలోనే చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఉంది. అయినప్పటికీ దాన్ని ఉపయోగించకుండా టేబుల్ దగ్గరే ఇలా చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పక్కనే కూర్చున్న మహిళ ఏం చేసిందో తెలుసా?
ఈ వీడియోలో మరో విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వ్యక్తి టేబుల్ పక్కనే చేతులు కడుక్కుంటూ నీళ్లను కింద పోస్తున్నప్పటికీ, అతనితో పాటు కూర్చున్న మహిళ మాత్రం ఏమీ జరగనట్లుగా తన భోజనాన్ని కొనసాగించింది. చుట్టూ నీళ్లు పడటం, అక్కడ గందరగోళం ఏర్పడటం, సిబ్బంది ఇబ్బంది పడటం వంటివేవీ ఆమె పట్టించుకోనట్లు కనిపించింది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు ఆ ఇద్దరి ప్రవర్తనపై రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కస్టమర్లు భోజనం చేస్తుండగానే..
ఆ వ్యక్తి చేతులు కడుక్కోవడంతో రెస్టారెంట్ ఫ్లోర్ తడిసిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగి తుడుపుకర్ర తీసుకుని వచ్చి నేలను శుభ్రం చేయాల్సి వచ్చింది. ఓవైపు కస్టమర్లు భోజనాన్ని చేస్తుంటే, మరోవైపు ఉద్యోగి వారి పక్కనే నిలబడి నేలపై పడిన నీటిని తుడుస్తూ కనిపించాడు.
ఈ దృశ్యాలు చూసిన చాలామంది రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు కనీస మర్యాదలు పాటించడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తున్నారు. మనం చేసే చిన్న పని వల్ల అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఎంత ఇబ్బంది కలుగుతుందో కూడా ఆలోచించాలని సూచిస్తున్నారు.
రెస్టారెంట్ యాజమాన్యం ఏమన్నదంటే ?
ఈ వీడియోను DK Signatures రెస్టారెంట్ యాజమాన్యమే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. అంతేకాకుండా, కస్టమర్లు రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన హ్యాండ్ వాషింగ్ సదుపాయాలను ఉపయోగించుకోవాలని కోరుతూ ఓ ప్రత్యేక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.
రెస్టారెంట్‌లోకి ప్రవేశించే డోర్ దగ్గరే వాష్‌బేసిన్ ఉందని, వెనుకవైపు టాయిలెట్ సదుపాయం కూడా ఉందని యాజమాన్యం వివరించింది. చేతులు శుభ్రం చేసుకోవడానికి అవసరమైన సబ్బు, టిష్యూలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అంటే కస్టమర్లు చేతులు కడుక్కోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, కొందరు ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని పరోక్షంగా తెలియజేసింది.
చేతులతో తినే ఆహారమే అయినా..
రెస్టారెంట్ యాజమాన్యం మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించింది. మా రెస్టారెంట్‌లో లభించే ప్రాన్స్ నూడుల్స్, సిఫుడ్స్ వంటకాల్లో కొన్నింటిని చేతులతో తింటేనే మంచి రుచి ఉంటుందని పేర్కొంది. అలాంటి ఆహారం తిన్న తర్వాత చేతులు కడుక్కోవాలనుకోవడం సహజమేనని, అందులో తప్పేమీ లేదని తెలిపింది. అయితే చేతులు కడుక్కోవడానికి సరైన సదుపాయాలు ఉన్నప్పుడు, డైనింగ్ టేబుల్ దగ్గరే చేతులు కడుక్కోవడం మాత్రం సరైన పద్ధతి కాదని స్పష్టం చేసింది.
నెటిజన్లు ఏమంటున్నారంటే ?
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కనీస మర్యాదలు, పరిశుభ్రత, రెస్టారెంట్ సిబ్బంది పట్ల కస్టమర్లు ఎలా వ్యవహరించాలనే అంశాలపై చర్చ మొదలైంది. రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని సూచిస్తున్నారు.
