దేశం మొత్తం నివ్వెరపోయిన ఘటన ఇది. కష్టం వచ్చిందని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళపైనే.. పోలీస్ స్టేషన్ లోనే.. పోలీసులు అత్యాచారం చేశారు.. ఇదెక్కడి ఘోరం అని నోరెళ్లబెడుతున్నారు. ఇది జరిగింది జార్ఖండ్ రాష్ట్రంలో. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. రక్షక భటులే భక్షక భటులు అన్న సామెతను నిజం చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు జనం. జార్ఖండ్ రాష్ట్రంలో జనం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావటంతో.. పోలీస్ స్టేషన్ లోని మొత్తం 15 మంది పోలీసులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.. ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్‌లోని సెరాయికేలా-ఖర్సవాన్ జిల్లాలో గమ్హరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
15 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటన బయటకు రావడంతో సెరాయికేలా-ఖర్సవాన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాధితురాలి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి ఆరోపణలపై పోలీసు సిబ్బందిపై చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ మనోజ్ స్వర్గియారి ఆదివారం మరో తొమ్మిది మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఇప్పటివరకు సస్పెండ్ అయిన పోలీసుల సంఖ్య 15కు చేరింది. తాజాగా సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు హవల్దార్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు.
అంతకుముందు శనివారం గమ్హరియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ ప్రసాద్‌తో పాటు మరో నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ముగ్గురు పోలీసుల అరెస్ట్.. జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేశారు. గమ్హరియా పోలీస్ స్టేషన్‌లో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నీరజ్ లక్రాపై మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
ఈ కేసు దర్యాప్తు కోసం సెరాయికేలా ఎస్‌డీపీఓ అనుభవ్ భరద్వాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఈ బృందం విచారణలో భాగంగా మరో ఇద్దరు పోలీసులను కూడా అరెస్ట్ చేసింది.
వారిలో సబ్‌ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ సాహు, కానిస్టేబుల్ సంతోష్ కుమార్ రాయ్ ఉన్నారు. వీరిద్దరినీ కూడా ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించే ప్రక్రియ చేపట్టారు. ఈ ఘటనలో మరికొందరి పాత్ర ఉందా? బాధితురాలికి సహాయం చేయాల్సిన సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? అనే కోణాల్లో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది.
అసలు ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లింది?
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలు అక్టోబర్ 29న కుటుంబ సమస్యల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
భర్తతో గొడవ పడిన ఆమెకు, తిరిగి ఇంటికి వెళ్తే భర్త తనపై దాడి చేసే అవకాశం ఉందనే భయపడింది. దీంతో ఆమె రాత్రిపూట పొరుగువారి ఇంటికి వెళ్లింది. తన భర్త వేధిస్తున్నాడని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫిర్యాదు చేయడానికి సహాయం చేయాలని ఆ పొరుగుఇంటివారిని అడిగింది.
దీంతో ఆ మహిళకు సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చెందిన పీసీఆర్ వ్యాన్ ఆమెను గమ్హరియా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఆమెకు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిని కేటాయించినట్లు సమాచారం. అయితే, అదే గదిలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నీరజ్ లక్రా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
