హైదరాబాద్: డిసెంబర్ 9 నుంచి 11 వరకు హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు స్కిల్ యూనివర్సిటీని సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది గ్లోబల్ సమ్మిట్ కోసం తాత్కాలిక నిర్మాణాలకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఈసారి ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా శాశ్వత నిర్మాణాల్లోనే సమ్మిట్ నిర్వహించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. గత నాలుగు నెలలుగా నిర్మాణ పనులను ముమ్మరం చేశామని, ముగ్గురు కాంట్రాక్టర్లను సమన్వయం చేస్తూ మెటీరియల్, కార్మికులు, ఎలక్ట్రిఫికేషన్ పనులను పూర్తి చేసినట్లు వివరించారు.
గ్లోబల్ సమ్మిట్‌కు సుమారు 2 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ల్యాబ్-1లో ఆరు, అకాడమిక్ బ్లాక్‌లో మూడు సెమినార్ హాళ్లను సిద్ధం చేశామని చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ కోసం మరో 13 గదులను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.
గత ఏడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.70 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈసారి అంతకంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, టాటా సంస్థ సహకారంతో రూ.4 వేల కోట్ల వ్యయంతో మరో 54 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు స్టైఫండ్‌తో కూడిన శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు.
నిర్ణీత గడువులోగా పనుల పూర్తి
స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు నవంబర్ 15 నాటికి 90 శాతం పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధులు వచ్చేలోగా, నవంబర్ 20 నాటికి అన్ని ఫినిషింగ్ పనులను పూర్తి చేసి యూనివర్సిటీని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. సమ్మిట్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
