కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయన.. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 2026 నవంబర్2న హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతకు ముందు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ రాంచందర్ రావు, ఇతర బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. భాగ్యలక్ష్మి ఆలయం సందర్శించిన తర్వాత ఆయన కాకతీయ హోటల్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఐటీసీ కాకతీయలో మధ్యాహ్నం 2:10 నుంచి 3:45 గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు.
అనంతరం 3:55 గంటలకు నిజాం కాలేజ్ ఎదుట ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి లోక్ తంత్ర బచావో - అరాచకత హటావో పేరుతో పాదయాత్రగా ఎంజే మార్కెట్ వరకు వెళ్తారు. పాదయాత్ర సాయంత్రం 5:05 గంటలకు మొజాంజాహీ మార్కెట్ చౌరస్తాకు చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి యాత్రను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు.
సభ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్తారు. అమిత్ షా పాదయాత్రకు తెలంగాణ బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. మరోవైపు.. అమిత్ షా పర్యటన ఉన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం: తెలుగులో అమిత్ షా ట్వీట్
బీజేపీ తెలంగాణ మీడియా ఎక్స్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ తెలుగులో ట్వీట్ చేశారు అమిత్ షా. ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తమ అరాచకాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా, అధికారం చేజిక్కించుకోవాలని కంకణం కట్టుకుంది అంటూ పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ కుటిల ప్రయత్నాల నుంచి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' మహా పాదయాత్రలో పాల్గొంటాను.. అని ఆయన ట్వీట్ చేశారు.
ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తమ అరాచకాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా, అధికారం చేజిక్కించుకోవాలని కంకణం కట్టుకుంది. కాంగ్రెస్ కుటిల ప్రయత్నాల నుంచి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' మహా పాదయాత్రలో పాల్గొంటాను.
— Amit Shah (@AmitShah) November 2, 2026
