ఫ్లైట్ ఛార్జీలు 700% పెంపుపై పిటిషన్.. అయితే విమానంలో ప్రయాణించకండి: సుప్రీంకోర్టు

ఫ్లైట్ ఛార్జీలు 700% పెంపుపై పిటిషన్.. అయితే విమానంలో ప్రయాణించకండి: సుప్రీంకోర్టు

విమాన ప్రయాణ ఛార్జీల విపరీతమైన పెంపుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విమాన ప్రయాణ ఛార్జీలు ఏకంగా 700% వరకు పెరిగిపోయాయని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురాగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ "అయితే విమానంలో ప్రయాణించకండి" అంటూ చురకలంటించింది. 

సామాజిక కార్యకర్త ఎస్. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా స్పందించింది. పండుగలు, సెలవుల సమయాల్లో ప్రైవేట్ విమాన సంస్థలు ఇష్టానుసారంగా ఛార్జీలను పెంచేస్తున్నాయని.. దీనిపై కఠినమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అల్గారిథమ్ ఆధారిత డైనమిక్ ప్రైసింగ్ వల్ల కొన్ని గంటల్లోనే టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, లగేజ్ పరిమితి తగ్గింపుతో పాటు అదనపు ఛార్జీల వసూళ్లు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

మహాకుంభ్ లాంటి సమయంలో విమానయాన సంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని గతంలోనూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే మార్గంలో ఒకే రోజు ఒక ఎయిర్‌లైన్ రూ.8వేలు వసూలు చేస్తే, మరో సంస్థ రూ.18వేలు వసూలు చేయడంపై కోర్టు గతంలోనే అభ్యంతరం తెలిపింది. ప్రయాణికులకు రక్షణ కల్పించేలా విమాన ఛార్జీలను హేతుబద్ధీకరించాలని సూచించింది.

మరోవైపు విమానయాన రంగాన్ని నియంత్రించేందుకు 'భారతీయ వాయుయాన్ అధినియం-2024' కింద కొత్త నిబంధనలను ఖరారు చేసినట్లు అక్టోబర్ 16న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. త్వరలోనే ఈ నిబంధనలను ప్రచురిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ఈ నిబంధనలను నవంబర్ 16న తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. విమాన సంస్థల వాణిజ్య స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రయాణికులకు సరసమైన ధరలకు టికెట్లు లభించేలా ఎలాంటి మార్గదర్శకాలు వస్తాయో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఇంధన ధరల పెంపుతో వేల కోట్ల నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ లైన్ కంపెనీల భవిష్యత్తు కొత్త నిబంధనలు ఏం చేస్తాయే వేచి చూడాల్సిందే మరి.