బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ఇచ్చిన స్పెషల్ ట్రీట్ అదిరిపోయింది. ఈ రోజు ( నవంబర్ 2, 2026 ) తన 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న షారుఖ్.. తన అప్‌కమింగ్ మూవీ 'కింగ్'తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం సినిమా నుంచి తొలి పాట 'మిల్ జాయే తో'ను విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా షారుఖ్, దీపికా పదుకొణే జంటను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ పాటలో షారుఖ్ తనదైన స్టైల్‌లో "నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని" ( మై కాతిల్ నహీ, ఆషిక్ హూ ) అని చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం షారుఖ్, దీపికా మధ్య కనిపించే రొమాంటిక్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు షారుఖ్ సిక్స్‌ప్యాక్ ఫిజిక్, స్టైలిష్ లుక్ కూడా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీని చూసిన నెటిజన్లు ‘ఓం శాంతి ఓం’ రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఇక ఈ పాటలోని మరో స్పెషల్ అట్రాక్షన్ సంగీతం. బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్, అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్ కలిసి ఈ పాటకు పనిచేయడం విశేషం. సచిన్–జిగర్ సంగీతం అందించగా, వీరి కలయికపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. ఎస్‌ఆర్‌కే, అరిజిత్, ఎడ్ షీరన్ కాంబినేషన్ అదిరిపోయింది, 'కింగ్‌కు పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్ ' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ : Jailer 2 Records: రికార్డులన్నీ ఖతం.. రూ.800 కోట్ల క్లబ్‌లో జైలర్ 2..
మరోవైపు షారుఖ్ బర్త్‌డే వేడుకలు కూడా ప్రత్యేకంగా సాగాయి. ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌పై ఏర్పాటు చేసిన భారీ 'కింగ్' ట్రిబ్యూట్‌ను చూసేందుకు ఆయన స్వయంగా అర్ధరాత్రి డ్రైవ్‌కు వెళ్లారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గూగుల్ జెమినీకి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026 డిసెంబర్ 24న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ 'కింగ్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
