ట్రంప్ 'షిట్‌హౌస్' వ్యాఖ్యలకు నార్వే మాస్ కౌంటర్: అందమైన టాయిలెట్ల ప్రచారంతో గ్లోబల్ హిట్!

ట్రంప్ 'షిట్‌హౌస్' వ్యాఖ్యలకు నార్వే మాస్ కౌంటర్: అందమైన టాయిలెట్ల ప్రచారంతో గ్లోబల్ హిట్!

తనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కకపోవటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు.. నార్వే టూరిజం బోర్డు అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చింది. నోబెల్ శాంతి బహుమతి తనకు రాలేదన్న కోపంతో ట్రంప్ నార్వే దేశాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ దేశం పూర్తిగా తిప్పికొట్టడమే కాకుండా.. దాన్ని తమ టూరిజం రంగానికి అనుకూలంగా మార్చుకుని అద్భుతమైన యాడ్ క్యాంపెయిన్‌గా మార్చేసుకుంది. 

అసలు విషయానికొస్తే.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిచిగాన్‌లోని ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. నార్వే దేశాన్ని 'షిట్‌హౌస్ కంట్రీ' (చెత్త దేశం) అంటూ తీవ్ర దూషించారు. అంతేకాకుండా తనకు నోబెల్ రానందున ఇకపై నార్వే నుంచి ఎవరినీ అమెరికాలోకి రానివ్వబోనంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే నోబెల్ శాంతి బహుమతిని నార్వే ప్రభుత్వం ఇవ్వదు. పూర్తిగా ఒక స్వతంత్ర నార్వే కమిటీ దీన్ని ప్రకటిస్తుంది. 

అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నార్వే ప్రభుత్వం ఎలాంటి రాజకీయ వివాదాలకు, దౌత్యపరమైన గొడవలకు దిగలేదు. బదులుగా ఆ దేశ అధికారిక పర్యాటక సంస్థ 'విజిట్ నార్వే' ట్రంప్ విసిరిన పదాన్నే అస్త్రంగా మలచుకుంది. తమ దేశంలోని అత్యంత సుందరమైన, అధునాతనమైన పబ్లిక్ టాయిలెట్లను హైలైట్ చేస్తూ ఒక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. "మనం షిట్‌హౌస్‌లను మళ్లీ గొప్పగా చేద్దాం" అంటూ ట్రంప్ స్టైల్‌లోనే వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది.

నార్వేలోని ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో, సుందరమైన జలపాతాలు, పర్వతాలు, సముద్రపు ఇరుకైన జలసంధుల మధ్య నిర్మించిన అద్భుతమైన ఆర్కిటెక్చర్ టాయిలెట్లను ఈ క్యాంపెయిన్‌లో ప్రదర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్టులు రూపొందించిన 'స్టెగాస్టెయిన్ వ్యూపాయింట్ టాయిలెట్', సేంజా ద్వీపంలోని 'గోల్డెన్ టాయిలెట్', వేవ్ ఆకారంలో ఉన్న 'ఉరెడ్‌ప్లాసెన్' వంటి రెస్ట్ రూమ్‌ల ఫోటోలను విడుదల చేశారు. ఇవి కేవలం టాయిలెట్లు మాత్రమే కాదని.. అంతర్జాతీయ డిజైన్ అవార్డులను గెలుచుకున్న అద్భుతమైన నిర్మాణాలని నార్వే ప్రచారంలో పేర్కొంది.

ఈ వినూత్న క్యాంపెయిన్ సూపర్ సక్సెస్ కావటం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కేవలం 10 వేల డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో చేపట్టిన ఈ ప్రచారానికి సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. జస్ట్ 5 రోజుల్లోనే 170కి పైగా దేశాల నుంచి 80వేల మందికి పైగా ప్రజలు ఈ టాయిలెట్ వెబ్‌పేజీని వీక్షించారు. ఇందులో దాదాపు నాలుగో వంతు మంది అమెరికన్లే ఉండటం విశేషం. ట్రంప్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలను నార్వే టూరిజం బోర్డు తనదైన శైలిలో సానుకూలంగా మార్చుకుని ప్రపంచవ్యాప్తంగా టూరిజం ప్రచారంతో రచ్చ లేపుతోంది.