- మొజ్తబా ఖమేనీ హెచ్చరికలకు అమెరికా ప్రెసిడెంట్ కౌంటర్
- ఆ దేశంతో చర్చలు కొనసాగుతున్నా నమ్మలేమని కామెంట్
ఫ్లోరిడా: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమపై ఏ విధమైనా దాడికి పాల్పడినా వెంటనే దీటుగా జవాబిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించడంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇరాన్‌లోని ఒకటి, రెండు ప్రాంతాలను మట్టుబెట్టాల్సి ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈమేరకు శనివారం ఫ్లోరిడాలోని తన నివాసంలో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్ అణు సామర్థ్యాన్ని మేం ఇప్పటికే దెబ్బతీశాం. పీక్‌యాక్స్ పర్వత ప్రాంతంతో సహా మిగిలిన ఒకటి, రెండు స్థావరాలను ధ్వంసం చేయడం మాకు కేవలం10 నిమిషాల పని’’ అని ఇరాన్ అణు స్థావరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈ వారంలోనే దాడి చేసే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా..‘‘అంత తెలివితక్కువ ప్రశ్న ఎందుకు అడుగుతారు? ఒకవేళ దాడి చేయాలనే ఆలోచన ఉన్నా ఆ విషయాన్ని ముందే బయటపెడతానా?” అని ఎదురు ప్రశ్నించారు. ఇరాన్‌తో చర్చలు సాఫీగానే సాగుతున్నప్పటికీ ఆ దేశాన్ని పూర్తిగా నమ్మలేమని పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులే లక్ష్యం: మొజ్తాబా ఖమేనీ
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మార్చిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొజ్తాబా ఖమేనీ శనివారం తొలిసారిగా సైనిక అధికారులతో భేటీ అయ్యారు. ‘‘ఎక్కడి నుంచి ఎలాంటి భద్రతా ముప్పు ఏర్పడినా సరే వెంటనే ప్రతిస్పందించాలి. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ప్రతిదాడులు చేయాలి’’ అని కమాండర్లకు స్పష్టం చేశారు. సైన్యం దాడులు చేయాల్సిన టార్గెట్ల జాబితాలో అమెరికా, జియోనిస్ట్ శత్రువుల ఆస్తులను చేర్చాలని వారిని ఆదేశించారు.
మధ్యంతర ఎన్నికల తర్వాతే..
నవంబరు 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌పై సైనిక దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా కొన్ని గల్ఫ్ దేశాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. అయితే, ఈ అటాక్‌కు సంబంధించి ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
