న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ఇండియా కూటమి నిర్వహించిన ‘మహా ర్యాలీ’కి కౌంటర్‌గా పశ్చిమ ఢిల్లీలో బీజేపీ ప్రత్యేక నిరసన మార్చ్ చేపట్టింది. హరి నగర్ బస్ డిపో నుంచి తిలక్ నగర్ మెట్రో స్టేషన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది.
ఉదయం 11:30 గంటలకు మొదలైన ఈ యాత్రలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, సర్దార్ హెచ్.ఎస్. ఫూల్కా, మంజిందర్ సింగ్ సిర్సా, ఎంపీ బన్సూరి స్వరాజ్ తదితరులతో పాటు సిక్కు కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర నేపథ్యంలో ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
కాగా, ఇండియా కూటమి, బీజేపీ యాత్రల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్, న్యూఢిల్లీ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ప్రత్యేకించి రామ్‌లీలా మైదాన్ చుట్టుపక్కల ప్రాంతాలు, మింటో బ్రిడ్జ్ నుంచి సభా వేదిక వరకు 4,000 మందికి పైగా సిబ్బందిని భద్రతా విధుల్లో నిలిపారు.
కన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కార్యాలయ పరిసర ప్రాంతాల్లో బహుళ అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 నిబంధనలు అమల్లో ఉంచడంతో పాటు సీసీ కెమెరాలు, ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలు ప్రధాన మార్గాల్లో రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ, ఎమర్జెన్సీ వాహనాలు, ఆస్పత్రులకు ప్రత్యేక కారిడార్లను కేటాయించి రాకపోకలకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
