దీపావళి దీపాలు: మట్టి ప్రమిదలో వెలుగు.. వెలిగే ఆ దీపం వెనుక!

దీపావళి దీపాలు: మట్టి ప్రమిదలో వెలుగు..   వెలిగే ఆ దీపం వెనుక!

దీపావళి వచ్చిందంటే ప్రతి ఇంటా దీపాల వెలుగులు... ప్రతి గుమ్మంలో ప్రమిదల సందడి! కానీ ఆ ప్రమిద వెలగడానికి ముందు ఓ కుమ్మరి కుటుంబం చేతులు మట్టిలో తడుస్తాయి.చక్రంపై మట్టి రూపం మారుతుంది.. ఎండలో ఆరుతుంది. కొలిమిలో కాలుతుంది. అప్పుడే దీపంగా మన ఇంటికి చేరుతుంది! పండుగ వేళ అందరి ఇళ్లలో వెలుగులు నింపే కుమ్మరుల బతుకుల్లో మాత్రం కష్టాలు ఇంకా చీకట్లనే మిగులుస్తున్నాయి. 

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఇళ్లన్నీ దీపాల వెలుగులతో నిండిపోతాయి. కానీ ఆ దీపాల వెలుగుల వెనుక మట్టి ప్రమిదలు తయారుచేసే కుమ్మరుల కఠోర శ్రమ, కన్నీళ్లు దాగి ఉన్నాయి.ఒకప్పుడు పండుగ సీజన్‌‌లో కళకళలాడిన కుమ్మరి కుటుంబాల జీవితాలు నేడు ఆధునికత, పెరుగుతున్న ఖర్చులు, యంత్రాల పోటీ వల్ల తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ నేటి ఆధునిక విద్యుత్ సాంకేతికతతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. దీంతో దీపావళికి మట్టి ప్రమిదలు తయారు చేసే కుమ్మరి కుటుంబాలకు ప్రస్తుత పరిస్థితి  కష్టాలు, కన్నీళ్లు మిగిలిస్తున్నాయి.

దీపావళికి మట్టి ప్రమిదలను కుమ్మరివాడల్లో ఉండే సంప్రదాయ కుమ్మరి కళాకారులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలలోని కుమ్మరివాడల్లో కుమ్మరి కుటుంబాలు దీపావళికి నెల రోజుల ముందు నుంచే మట్టి ప్రమిదల తయారీలో బిజీగా ఉంటారు. 

తెలంగాణలో అరెపల్లి, మేడ్చల్, బాలికా నగర్ వంటి వివిధ ప్రాంతాలతో పాటు కుమ్మరివాడల్లో చేతితో తయారు చేసే మట్టి దీపాలు ఎక్కువగా లభిస్తాయి. కానీ రంగురంగుల విద్యుత్ దీపాలు అందుబాటులోకి రావడంతో  మట్టి ప్రమిదలకు గిరాకీ తగ్గింది. ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ ఈ-పోర్టల్ ద్వారా కూడా సంప్రదాయ ప్రమిదల తయారీదారులకు ఆన్‌‌లైన్ అమ్మకాలు చేస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు.  

మట్టి ప్రమిదలు..కుండల తయారీ

హైదరాబాద్‌‌లోని ధూల్‌‌పేట్, ఆసిఫ్ నగర్, బేగం బజార్ వంటి ప్రాంతాల్లో స్థానిక కుమ్మరి కుటుంబాలు పండుగకు ముందు సంప్రదాయ మట్టి దీపాలను చేతితో తయారుచేయడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఒక కుమ్మరి తన చక్రంపై మట్టి కుండ లేదా దీపావళి దీపాన్ని తయారుచేస్తున్నాడు.

హైదరాబాద్‌‌లో ధూల్‌‌పేట్ మట్టి ప్రమిదలకు  చాలా ప్రసిద్ధి. ఇక్కడ కుటుంబాలు తరాలుగా చక్రం తిప్పుతూ మట్టి దీపాలను తయారు చేస్తున్నారు. ఆసిఫ్ నగర్, బేగమ్ బజార్, పాతబస్తీలోని ప్రాంతాల్లో దీపావళికి ముందు మట్టి దీపాలు, లక్ష్మీ పూజ కుండల తయారీ జోరుగా సాగుతుంది. 

సాధారణ మట్టి ప్రమిదలు ఒక్కొక్కటి దాదాపు రూ.2 నుంచి రూ.10 వరకు లభిస్తున్నాయి. రంగులు వేసిన లేదా డిజైన్ చేసిన ప్రమిదలు సెట్ లేదా పీస్‌‌కు రూ.10 నుంచి రూ.45 లకు విక్రయిస్తున్నారు. ప్రత్యేక డిజైన్ ప్రమిదల గిఫ్ట్ సెట్స్ రకాలను బట్టి  రూ.250 నుంచి రూ.650 వరకు ఉన్నాయి.

హైదరాబాద్‌‌లో దీపావళి సందడి

హైదరాబాద్‌‌ నగరం దీపావళి సమయంలో  రంగురంగుల విద్యుత్ దీపాలు, ప్రమిదల వెలుగులతో ఎంతో అందంగా మెరిసిపోతుంది. ‘‘దీపావళి మాకు చాలా ప్రత్యేకమైన పండుగ. కుమ్మరి కుటుంబంలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే మట్టి ప్రమిదలు తయారుచేయడం నా జీవితంలో ఒక భాగంగా మారింది. మా తాతయ్య, అమ్మమ్మలకు ప్రమిదలకు ఆకృతిని ఇవ్వడంలోనూ, వాటిని అలంకరించడంలోనూ నేను సహాయపడేవాడిని. ఆ రోజులకు సంబంధించిన ఎన్నో తీపి జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి’’అన్నాడు  డి. మల్లేష్.

కుమ్మరి కళాకారుల ఆవేదన

కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ఇప్పుడు చాలామంది విద్యుత్ దీపాలను లేదా ప్లాస్టిక్ దీపాల అలంకరణలను ఇష్టపడుతున్నారు. దీనివల్ల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడిందంటారు కుమ్మరి కళాకారులు. తరతరాలుగా  వారసత్వంగా చేపట్టిన కుమ్మరి వృత్తిని ఏడాది పొడవునా కొనసాగించేందుకు, నిరంతరం కొత్త డిజైన్లను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటాం కానీ, తమ కళకు ప్రజల్లో గుర్తింపు లేదని కుమ్మరి కళాకారులు ఆవేదనగా చెప్పారు.

ప్రజలు ఇప్పటికీ ఈ సంప్రదాయ మట్టి ప్రమిదల్లోని అందాన్ని గుర్తించాలని, తమలాంటి కళాకారులను ప్రోత్సహించాలని కుమ్మరి కళాకారులు కోరారు. ప్రస్తుతం చైనా లైట్లు, ప్లాస్టిక్ దీపాల వాడకం పెరగడం, మట్టి కొరత, ధరలు పెరగడం వల్ల స్థానిక కుమ్మరులు ఉపాధి పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

 ఎన్నెన్నో మట్టి ప్రమిదల తయారీ కేంద్రాలు

హైదరాబాద్‌‌లో దీపా దివ్వ అనే పేరుతో కుమ్మరి స్టూడియోలో కళాకారులు టెర్రకోట దీపాలను తయారు చేస్తున్నారు. దీపా శర్మ అగర్వాల్ హైదరాబాద్‌‌లోని సుపరిచితమైన కుమ్మరి, సిరామిక్ కళాకారిణి. ఈమె టెర్రకోట కుండలు,చేతితో తయారు చేసిన మట్టి వస్తువులను విక్రయిస్తారు. నాచారంలోని శ్రీ గోవింద్ టెర్రకోటాస్ వివిధ రకాల మట్టి ప్రమిదలు, మొక్కల కుండలు, డెకరేటివ్ టెర్రకోట వస్తువులను తయారుచేస్తోంది.

 బేగంబజార్ ఫీల్ ఖానాలోని శ్రీ భవానీ మట్టి దీప్, నాగోల్ లోని మిట్టీ కళాక్రుతి కేంద్రం, శ్రీ బాలాజీ మట్టి టెర్రకోట తయారీదారులు మట్టి ప్రమిదలను తయారు చేస్తున్నారు. నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలోని కుంభకార్ మిట్టి కళాకృతి కేంద్రం, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని డి కిషన్ పాట్స్ మేకర్స్ దీపావళి దివ్వెలు, దీపాలను తయారు చేస్తున్నారు.

సికింద్రాబాద్ కుమ్మరిబజార్, శిల్పారామం, బేగం బజార్, సుల్తాన్ బజార్​లలో సంప్రదాయ మట్టి ప్రమిదలు, రకరకాల డిజైన్ల దీపాలు హోల్‌‌సేల్ ధరలకే లభిస్తున్నాయి.శిల్పారామంలో టెర్రకోట ప్రమిదలు లభిస్తున్నాయి. నాచారం టెర్రకోట మార్కెట్ లో ఫ్యాన్సీ, డిజైనర్ టెర్రకోట ప్రమిదలు లభిస్తున్నాయి. 

ఆన్‌‌లైన్ లో మట్టి ప్రమిదల విక్రయాలు 

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఈ ఏడాది మొదటి సారిగా మట్టి ప్రమిదలను ఆన్‌‌లైన్, దుకాణాల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కెవిఐసి అక్టోబర్ 8న దియాల ఆన్‌‌లైన్ అమ్మకాన్ని ప్రారంభించింది.

 ఈ అమ్మకాల కారణంగా కెవిఐసి కొత్త సెట్ డిజైనర్ డియాస్‌‌ను కూడా విడుదల చేసింది. 8 రకాల డిజైనర్ దియాస్‌‌ను కెవిఐసి ఆన్‌‌లైన్‌‌ పోర్టల్‌‌లో అందుబాటులో ఉంచింది. దియాలతో పాటు లక్ష్మి దేవతల మట్టి విగ్రహాలు, ఇతర అలంకరణ వస్తువులను తన అవుట్ లెట్ల ద్వారా ఖాదీబోర్డు విక్రయిస్తోంది. 

దీపావళి దీపం... కేవలం మట్టి ప్రమిద కాదు. తరతరాలుగా కొనసాగుతున్న ఓ కళకు ప్రతీక. ఓ కుటుంబం జీవనాధారానికి ఆధారం. యంత్రాల వేగం పెరిగినా, చేతివృత్తుల విలువ తగ్గకూడదు. మన ఇంటి గుమ్మంలో మట్టి ప్రమిద వెలిగితేనే సరిపోదు. ఆ ప్రమిదను చేసిన కుమ్మరి ఇంట్లోనూ వెలుగు నిండాలి! 

మట్టి ప్రమిదల తయారీ ఇలా...

దీపావళికి మట్టి ప్రమిదల తయారు చేయడం వెనుక నెలల తరబడి కుమ్మరి కళాకారుల శ్రమ ఉంటుంది. చెరువుల నుంచి బంకమట్టిని సేకరించడం, దానిని శుద్ధి చేయడం, చక్రంపై పెట్టి ఆకృతిని ఇవ్వడం, ఆపై ఎండబెట్టి బట్టీలో కాల్చడం వంటి ప్రతి దశలోనూ కుటుంబం మొత్తం రాత్రింబవళ్లు కష్టపడాల్సి ఉంటుంది. చల్లారిన తర్వాత చాలా దీపాలను వాటి సహజమైన మట్టి రంగులోనే వదిలేస్తారు.

అయితే మరికొన్నింటికి దీపావళి కోసం ప్రకాశవంతమైన యాక్రిలిక్ రంగులు, మెరుపులు లేదా సంప్రదాయ నమూనాలతో చేతితో రంగులు వేస్తారు. ఇలా దీపాల తయారీ కోసం రాత్రింబవళ్లు కష్టపడినా ఆదాయం అంతంత మాత్రమే. 

ఇంత కష్టపడి తయారుచేసిన ప్రమిదలను మార్కెట్‌‌లో చాలా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. మధ్యవర్తుల దోపిడీ వల్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని కుమ్మరి కళాకారులు ఆవేదనగా చెప్పారు.