చండీఘర్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, చేతన్ సింగ్ జౌరమజ్రాలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. అమృత్‌సర్ నార్త్ శాసన సభ్యుడు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా
మాజీ ఐపీఎస్ అధికారి అయిన కున్వర్ విజయ్ ప్రతాప్ గత శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అమృత్‌సర్ నార్త్ నుంచి ఆప్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. గతకొంత కాలంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కున్వర్ విజయ్ ప్రతాప్ వెల్లడించారు. ‘‘అమృత్‌సర్‌లోని నా అత్యంత గౌరవనీయ సోదర సోదరీమణులారా నేను పంజాబ్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. మీరు నా పట్ల చూపిన ప్రేమ, గౌరవానికి నా చివరి శ్వాస వరకు మీకు రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు.
మీ సహకారం, భగవంతుని ఆశీస్సులతో ఎమ్మెల్యేగా నా లక్ష్యాలలో 90 శాతం సాధించానని తెలిపారు. మాదకద్రవ్యాలు, దోపిడీలు, గూండాయిజం, అవినీతిలో కూరుకుపోయిన పంజాబ్‌ను తిరిగి ఒక ప్రగతిశీల, ప్రజల ఆదరణ పొందిన రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు. తన నియోజకవర్గంలో భూస్వామ్య మై-బాప్పోషక-సేవక రాజకీయాలకు ముగింపు పలికానని.. ఎల్లప్పుడూ అమృత్‌సరి వాసుల గొంతుకను వినిపించానని పేర్కొన్నారు. నీరు, మురుగునీటి సమస్యల నుంచి సర్క్యూట్ హౌస్, కంపెనీ బాగ్, మురికి కాలువలు, గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, సరూప్ రాణి కళాశాల, బర్గాడి మత విద్వేష కేసు వంటి సమస్యలను ధైర్యంగా ప్రస్తావించానని గుర్తు చేశారు.
రెండు రోజుల్లోనే ముగ్గురు గుడ్ బై
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మందితో ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఈ జాబితా ప్రకటించిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఎమ్మెల్యేలు హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, చేతన్ సింగ్ జౌరమజ్రాలు, కున్వర్ విజయ్ ప్రతాప్ ఆప్‌కు గుడ్ చెప్పారు. టికెట్ కేటాయింపులపై తీవ్ర అసంతృప్తితోనే వీరంతా పార్టీకి గుడ్ బై చెప్పినట్లు సమాచారం. వీరి బాటలోనే మరికొందరు నేతలు సైతం నడవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట సిట్టింగ్ ఎమ్మెల్యేలు వరుసగా ఆప్‌ను వీడటంతో పంజాబ్ లో కొత్త రాజకీయం మొదలైంది.
2027 మొదట్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు
2027 ఫిబ్రవరి, మార్చి నెలలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండగానే అధికార ఆప్ ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే 40 నియోజకవర్గాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
