ఆకాశాన్నంటుతున్న నగరాల్లోని ఖర్చులు ఇప్పుడు భారీ వేతనాలు అందుకునే ఐటీ ఉద్యోగులను కూడా ఆందోళనకు గురిచేయటం నెట్టింట చర్చలు దారితీసింది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కుటుంబ పోషణ కోసం నగరాల్లో పడుతున్న ఇబ్బందులను, పెరుగుతున్న నిత్యవసర ధరలను ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ఈ ఖర్చుల్లో సాధారణ జనం కుటుంబాలను ఎలా నెట్టుకొస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది.
బెంగళూరుకు చెందిన రామ్శ్రీ గౌతమ్ గొల్ల అనే సోషల్ మీడియా యూజర్ తన కుటుంబ ఖర్చుల గురించి ఒక పోస్ట్ పెట్టారు. తన ఫ్యామిలీలో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని.. బయట ఎక్కడా ఫుడ్ ఆర్డర్ చేయకుండా.. పూర్తిగా ఇంట్లోనే వంట చేసుకుంటున్నప్పటికీ నెలకు కేవలం తిండి, కిరాణా ఖర్చులకే రూ. 60వేల నుంచి రూ. 80వేల వరకు ఖర్చవుతోందని వాపోయారు. వారానికి 2 సార్లు మాత్రమే నాన్-వెజ్ తింటున్నప్పటికీ ఈ స్థాయిలో బిల్లు వస్తోందని.. "ఈ కాలంలో అందరూ ఎలా బతుకుతున్నారు?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరైతే ఈ మొత్తం చాలా ఎక్కువని అంటున్నారు. మరికొందరైతే తిండి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని టెక్కీ వాదనను సమర్థించారు. తమకు కూడా కిరాణా బిల్లులు తడిసిమోపెడవుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నగరాల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటే ఈ మాత్రం ఖర్చు కావడం సాధారణమేనని మరికొందరు వాదించారు.
ఈ భారీ ఖర్చు ఎక్కడవుతోందనే సందేహాలకు గౌతమ్ తన నెలవారీ కొనుగోళ్ల వివరాలను పంచుకున్నారు. నెలకు కేవలం కోడిగుడ్లకే సుమారు రూ. 3వేలు (రోజుకు సగటున 10 గుడ్లు), పాలకు రూ. 2వేల నుంచి రూ. 3వేలు, వారానికి రెండుసార్లు తెచ్చే మాంసానికి రూ. 6వేల నుంచి రూ. 8వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఇక ఇడ్లీ, దోశ పిండికి రూ. 3వేల వరకు పోగా... కిలో రూ. 80 పలికే బియ్యం, కేజీ రూ. 200 నుండి రూ. 400 పైగా ఉన్న పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, వంట నూనెలు ఇలా అన్నీ కలిపితే నెలకు కిరాణా బిల్లు తడిసి మోపెడౌతోంది.
అయితే ఇదే కుటుంబం రూ. 15వేల నుండి రూ. 30వేల లోపు కూడా జీవనం సాగించవచ్చని మరికొందరు యూజర్లు తమ నెలవారీ బడ్జెట్ వివరాలను పంచుకున్నారు నెట్టింట. కుటుంబ సభ్యుల సంఖ్య ఒకేలా ఉన్నా.. ఎక్కడ కొనుగోలు చేస్తారు, ఎలాంటి బ్రాండ్లు వాడుతారు, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాలను బట్టి ఖర్చులు మారుతుంటాయని చాలా మంది అంటున్నారు.
ALSO READ : వాట్సాప్‌లోనే EPFO సేవలు.. ఈజీగా PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు తెలుకోండిలా..
మొత్తానికి ఒక మధ్యతరగతి కుటుంబం నెలకు కేవలం తిండి కోసమే రూ. 80 వేల వరకు వెచ్చించాల్సి రావడం నేటి ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఐటీ ఉద్యోగులు, టాప్ కంపెనీల్లో హై ప్రొఫైల్ జాబ్స్ చేస్తూ భారీ వేతనాలు అందుకునే వారికే ఈ స్థాయి ఖర్చులు భారంగా మారుతుంటే.. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న అసలు సిసలు ప్రశ్న.
