న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనేజేషన్ (ఈపీఎఫ్‌ఓ) మెంబర్లు తమ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలను వాట్సాప్ ద్వారా ఈజీగా పొందొచ్చు. సంస్థ 74వ పౌండేషన్ డే సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ఈ వాట్సాప్ సేవలను ప్రారంభించారు. మరోవైపు నిరుపయోగంగా పడివున్న ఖాతాల (ఇన్‌ఆపరేటివ్) ఆటోమేటిక్ సెటిల్‌మెంట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఇలాంటి ఖాతాలు వెరిఫై అయితే రూ.వెయ్యి లోపు బ్యాలెన్స్ ఉంటే ఎలాంటి దరఖాస్తులు లేకుండానే ఈ అమౌంట్ మెంబర్ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది.
వాట్సాప్ సర్వీస్‌లు ఇలా..
వాట్సాప్ సర్వీసులు పొందాలంటే ఈపీఎఫ్‌ఓ అధికారిక వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ +91 8796441800కు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ ద్వారా "Hi" లేదా "Hello" అని మెసేజ్ పంపాలి. ఈపీఎఫ్‌ఓ అధికారిక చాట్‌బాట్ నుంచి మెనూ కనిపిస్తుంది. యూఏఎన్ ఆధారంగా సాధారణ మొబైల్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్ల నుంచి కావాల్సిన సేవను ఎంచుకోవచ్చు. యుఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. దానికి లింకై ఉన్న మొబైల్ నంబర్ నుంచే మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
