పేదరికం 90% డౌన్‌‌‌‌‌‌‌‌ ..ప్రపంచ బ్యాంక్ నివేదికపై ప్రధాని మోదీ హర్షం

పేదరికం 90% డౌన్‌‌‌‌‌‌‌‌ ..ప్రపంచ బ్యాంక్ నివేదికపై  ప్రధాని మోదీ హర్షం

న్యూఢిల్లీ: ఇండియాలో తీవ్ర పేదరికం చారిత్రాత్మక రీతిలో తగ్గిందని ప్రపంచ బ్యాంక్  విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ మూవీ ‘దాస్వీ’లోని ‘థాన్‌‌‌‌‌‌‌‌ లియా’  పాటను నేపథ్య సంగీతంగా జోడించి ఆయన తన ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్​లో ఒక పోస్ట్‌‌‌‌‌‌‌‌ ను పంచుకున్నారు. 

పేదరికం తగ్గుముఖం పట్టడం దేశ యువతకు రాబోయే తరానికి లభించిన గొప్ప అవకాశంగా ప్రధాని అభివర్ణించారు. ‘వరల్డ్​బ్యాంక్​రిపోర్టు ప్రకారం 2011 నుంచి 2023 మధ్య కాలంలో భారతదేశంలో ఏకంగా 49.6 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దీనివల్ల తీవ్ర పేదరిక రేటు 90 శాతం తగ్గింది. 

గతంలో నలుగురు భారతీయుల్లో ఒకరు పేదరికంలో ఉండగా, అది ఇప్పుడు 38 మందిలో ఒకరికి పరిమితమైంది. కేవలం ఆరేండ్లలో దేశంలో ఉపాధి 13.4 కోట్లు పెరిగింది. ఇది పనిచేసే వయస్సు ఉన్న జనాభా పెరుగుదల కంటే దాదాపు రెట్టింపు’ అని మోదీ వివరించారు. 

ఆర్థిక అసమానతలను కొలిచే ప్రధాన ప్రమాణమైన గిని ఇండెక్స్  ఇండియాలో 20 శాతానికి పైగా తగ్గి 23.0కి చేరినట్లు పేర్కొన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ ఇచ్చిన ‘గరీబీ హఠావో’ నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వానికి పేదరిక నిర్మూలన అనేది కేవలం నినాదం కాదు, ఒక స్పష్టమైన సంకల్పమని ప్రధాని స్పష్టం చేశారు.

6 రాష్ట్రాల ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, కర్నాటక, తమిళనాడు,  హర్యానా, కేరళ రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలం ఈ రాష్ట్రాల ప్రజల జీవితాల్లో కొత్త అవకాశాలను, నిరంతర పురోగతిని తీసుకురావాలని ఆకాంక్షించారు.