చండీగఢ్: విదేశీ శక్తుల ఆదేశాలతోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆరోపించారు. దేశంలో అశాంతి సృష్టించేందుకు విదేశీ శక్తుల టూల్‌కిట్ ప్రకారం పనిచేస్తున్నారని విమర్శించారు.
ఓట్ల తొలగింపు పేరుతో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. ఆదివారం హర్యానాలోని రోహ్తక్లో బీజేపీ నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో.. అరాజక్త హటావో’ పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల తీర్పును అంగీకరించలేకే కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని ఫైర్అయ్యారు.
హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలో గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పే కాంగ్రెస్.. ఇతర రాష్ట్రాల్లో ఓడిపోతే మాత్రం ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందంటూ ఆరోపిస్తోందని ఎద్దేవా చేశారు. దేశం గాంధీ కుటుంబం రాసిన నిబంధనలతో కాకుండా రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని స్పష్టం చేశారు. 1984 సిక్కు అల్లర్లపై కాంగ్రెస్ ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని విమర్శించారు.
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లలో 2.5 కోట్ల మంది చనిపోయినవారు, 6 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు ఉన్నారని చెప్పారు. మరో 3 కోట్ల మంది చొరబాటుదారుల పేర్లను తొలగించారని పేర్కొన్నారు. అలాంటి పేర్లను తిరిగి చేర్చాలని రాహుల్ ఎందుకు పట్టుబడుతున్నారని ప్రశ్నించారు.
