జవహర్‌నగర్, వెలుగు: సరదాగా గడిపేందుకు క్వారీ వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన రోహిత్(18), సయాన్(18), రక్షిత్, మురారి, పీయూష్ కలిసి ఆదివారం సరదాగా గడిపేందుకు మల్కారం క్వారీ వద్దకు వెళ్లారు.
అక్కడే భోజనం తయారు చేసుకొని తిన్న తర్వాత ప్లేట్లు శుభ్రం చేస్తుండగా కొన్ని నీటిలో పడిపోయాయి. వాటిని తీసేందుకు సయాన్, రోహిత్ క్వారీలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు యువకులు ఒడ్డునే ఉండిపోయారు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీఆర్ఎఫ్ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా, మల్కారం ప్రాంతంలోని క్వారీ గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయని, క్వారీల వద్ద రక్షణ చర్యలు చేపట్టి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
