గట్టుప్పల్, వెలుగు: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల కోసం అవసరమైతే పదవులను సైతం వదులుకుంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రెండేండ్లలో గట్టుప్పల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆదివారం నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో కురుమ సంఘానికి చెందిన బీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించి, మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ పదేళ్లు అధికారంలో ఉండి మునుగోడుకు సాగునీరు తీసుకురావడానికి ఏం చేశారని ప్రశ్నించారు.
తన రాజీనామా పోరాటంతోనే గట్టుప్పల్ మండలం, చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించి సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతోందని తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభ శ్రీనివాస్‌రెడ్డి, కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుండే వెంకటేశ్, కురుమ సంఘం అధ్యక్షుడు కుండే సత్తయ్య, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
