భువనగిరి, వెలుగు : బెట్టింగ్ వ్యసనానికి బానిస అయిన యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణిగుంటకు చెందిన గంధమల్ల భరత్ (35) ప్రస్తుతం భువనగిరి పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. భువనగిరిలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్న భరత్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు.
బెట్టింగుల్లో నష్టపోయి అప్పులు చేశాడు. దసరా సందర్భంగా భార్య సంతోష పుట్టింటికి వెళ్లగా, భరత్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. భార్యకు సూసైడ్ నోట్ రాసిన భరత్ ఉరి వేసుకుని చనిపోయాడు. “నన్ను క్షమించు.. ఎన్నిసార్లు మారాలనుకున్నా మారలేకపోయాను.
మళ్లీ బెట్టింగ్ ఆడాను. డబ్బులు అన్ని పోయినవి. నేను చేసిన తప్పు ఎంతగానో బాధ పెడుతుంది. నేను బెట్టింగ్ ఆడడం మరవలేకపోతున్నా.. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నీకు, పాపకు సారీ చెబుతున్నాను.
నేను తప్పు చేశాను గనుక నీకు మొఖం చూపించలేక చనిపోతున్న. పాపను జాగ్రత్తగా చూసుకో” అని లేఖలో రాసినట్లు సమాచారం. భరత్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
