హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం (నవంబర్ 1) మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూర్ మండల ఎస్సై శివకుమార్‌కు రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలో అక్రమ బెల్ట్ షాపులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
గ్రామాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ బెల్ట్ షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్సైని ప్రశ్నించారు. చండూర్ మండల పరిధిలో బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలని సూచించారు.
లేదంటే ఇక్కడ విధులు నిర్వహించడానికి వీల్లేదని హూకుం జారీ చేశారు. వారం రోజుల్లోగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని 19 గ్రామ పంచాయతీలలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
