అమరావతి: రాప్తాడు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బాలికపై దాడికి పాల్పడిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలికను ఆదివారం (నవంబర్ 1) మంత్రి లోకేష్ పరామర్శించారు. బాలిక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికకు అందుతున్న చికిత్సపై ఆసుపత్రి వైద్యులతో సుదీర్ఘంగా చర్చించారు.
విద్యార్థినికి అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేశామని, బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వచ్చే 48 గంటల పాటు అత్యంత కీలకమని వైద్యులు పేర్కొన్నారు. మా బిడ్డలా భావించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు లోకేష్. బాలిక ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు లోకేష్. అనంతరం పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు వెళ్లి బాలికను చూశారు లోకేష్.
అనంతరం బాలిక తల్లిదండ్రులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఘటన జరిగిన తీరును స్కూల్ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం, తాను అన్ని విధాలా అండగా ఉంటామని బాలిక కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మంత్రి లోకేష్‌తో పాటు ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.
