న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికలు చట్టవిరుద్ధమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒకవేళ 2024 పార్లమెంట్ ఎన్నికలు చట్టవిరుద్ధం అయితే రాహుల్ గాంధీ ఎన్నిక, ఆయన చేపట్టిన లోక్ సభ ప్రతిపక్ష నేత పదవి కూడా అక్రమమే అవుతుందని బీజేపీ ఎదురు దాడి చేసింది. ఇండియా కూటమి ర్యాలీ ఒక ఫ్లాఫ్ షో అని అభివర్ణించింది. ఈ ర్యాలీని ప్రజలు పెద్దగా ఆదరించలేదని.. రాంలీలా మైదాన్ సగం ఖాళీగానే ఉందని ఎద్దేవా చేసింది.
ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి మార్చ్‌ను తాను ఉదయం నుంచి ఫాలో అవుతున్నానని.. రాహుల్ గాంధీ స్పీచ్ పూర్తిగా టైమ్ వేస్ట్ అని ఎద్దేవా చేశారు. 2024 పార్లమెంటరీ ఎన్నికలు జరిగినప్పుడు జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా లేరని కౌంటర్ ఇచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికలపై అనుమానాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని ప్రతిపక్ష నేతలకు సూచించారు.
ఎన్నికలు అక్రమంగా జరిగాయని భావిస్తే దానిని కోర్టులో ఎందుకు సవాల్ చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లు తర్వాత ఎన్నికలు చెల్లవని ప్రకటించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. భారతదేశం రాహుల్ గాంధీ తండ్రి తాతలది చెందినది కాదని.. ఈ దేశం ఇక్కడి ప్రజలందరిదని అన్నారు. ప్రజాస్వామ్యంలో కేవలం వంశపారంపర్యంగా కాకుండా కఠోర శ్రమతోనే ఒక వ్యక్తి దేశ ప్రధాని కాగలరన్నారు.
టీ అమ్మే ఒక సామాన్య వ్యక్తి ప్రధాని ఈ ప్రజాస్వామ్య గొప్పతనమని పేర్కొంటూ ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రధాని మోడీ ఆదరణను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. సర్ పేరుతో ఈసీ అక్రమంగా ఓట్లు తొలగించలేదని.. మరణించిన, వేరే ప్రాంతాలకు మారిన, నకిలీ ఓటర్లను మాత్రమే తొలగించారని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలతో రాహుల్ గాంధీ దేశంలో అరాచకత్వాన్ని సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
