కోదాడలో రూ.75 లక్షల గంజాయి పట్టివేత.. హైవేపై ఈగల్ ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్

కోదాడలో రూ.75 లక్షల గంజాయి పట్టివేత.. హైవేపై ఈగల్ ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్

హైదరాబాద్: కోదాడలో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని తెలిపారు. కోదాడ హైవేపై ఈగల్ ఫోర్స్, కోదాడ టౌన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టి గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. 

నిందితులను కర్ణాటకకు చెందిన సెల్వ సూర్య (26), రాజా గౌండర్ మురుగన్‏గా గుర్తించారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన హోండా సిటీ కారును సీజ్ చేశారు.  ఒడిశా నుంచి కర్ణాటకకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గంజాయి రవాణా చేసినందుకు నిందితులు రూ.20 వేలకు ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 

ఒడిశాలోని చిత్రకొండకు చెందిన రాజు నుంచి గంజాయి సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్ ప్రాంతానికి చెందిన ఈశ్వర్ గౌండర్, శివప్ప గంజాయి రిసీవర్లుగా గుర్తించారు. వీరి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒడిశా నుంచి కర్ణాటక వరకు విస్తరించిన గంజాయి నెట్ వర్క్‎పై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

గంజాయి మూలాలు, నెట్‌వర్క్ వెనుక ఉన్నవారిపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయి, కారును ఈగల్ ఫోర్స్ టీమ్ కోదాడ పోలీసులకు అప్పగించింది. కోదాడ పోలీసులు ఈ ఘటనపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.