జ్ఞానేష్‎కు సీఈసీగా కొనసాగే అర్హతే లేదు.. వెంటనే పదవి నుంచి తొలగించండి: రాహుల్

జ్ఞానేష్‎కు సీఈసీగా కొనసాగే అర్హతే లేదు.. వెంటనే పదవి నుంచి తొలగించండి: రాహుల్

న్యూఢిల్లీ: దేశంలో ఓట్ చోరీకి మోడీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ అన్నారు. సర్ ప్రక్రియలోని అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్‎ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం (అక్టోబర్ 31) ఇండీ కూటమి మాక్ పార్లమెంట్ చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ లోక్ సభ స్పీకర్ మీరా అధ్యక్షత వహించారు. 

సర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డ సీఈసీ జ్ఞానేష్ కుమార్‏ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని మల్లికార్జున ఖర్గే ప్రజా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 2024లో ప్రతిపక్షానికి, అధికార పక్షానికి కేవలం 3 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన 15 శాతం మంది ఓట్లు తీసేశారని ఆరోపించారు. 2024లో బీజేపీ ఎంపీలు అక్రమంగా లోక్ సభలోకి ప్రవేశించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‎తో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓట్ చోరీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  జ్ఞానేష్‎ కుమార్‎ ప్రధాని మోడీ రక్షిస్తున్నాడని ఆరోపించారు. జ్ఞానేష్‎ కుమార్‎కు సీఈసీగా కొనసాగే అర్హతే లేదని.. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలి డిమాండ్ చేశారు. 

►ALSO READ | ఫేమస్ జర్నలిస్ట్ను రెండో పెళ్లి చేసుకున్న జమ్ము కశ్మీర్ సీఎం !

పార్లమెంట్‎ ద్వారా జ్ఞానేష్ కుమార్‎ను తొలగించేందుకు అభిశంసన తీర్మానం పెడితే ప్రభుత్వం అడ్డుకుంటోందని.. మాకు మరో మార్గం లేకనే మాక్ పార్లమెంట్ ద్వారా ప్రజా అభిశంసన పెట్టామని స్పష్టం చేశారు. ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని ఒక రాజకీయ ఆయుధం రాహుల్ అభివర్ణించారు. జ్ఞానేష్‎కు వ్యతిరేకంగా తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని.. అయినప్పటికీ అతడిని కాపాడాలని ప్రయత్నిస్తే బీజేపీ డ్రామాలు బయటపడతాయని హెచ్చరించారు.