విధుల్లో నిర్లక్ష్యం.. నిజామాబాద్ DCSO శ్రీకాంత్ రెడ్డి సస్పెండ్

విధుల్లో నిర్లక్ష్యం.. నిజామాబాద్ DCSO శ్రీకాంత్ రెడ్డి సస్పెండ్

నిజామాబాద్ DCSO శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేశారు. రైస్ మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆయనపై వేటు పడింది. CMR విషయంలోను శ్రీకాంత్ రెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలింది. ప్రతి నెలా తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు ఉంటాయన్న సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.

బియ్యం మరాడించేందుకు సర్కార్ నుంచి వడ్లు తీసుకుని స్వాహా చేసిన రైస్ మిల్లర్లపై అధికారులు క్రిమినల్, ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టడం తప్పితే రికవరీ చేయలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లపై కేసులు నమోదవుతున్నప్పటికీ.. బకాయిలు చెల్లించకపోయినా ఆస్తిని జప్తు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేసులు నమోదు చేశాక డిమాండ్ నోటీసులు పంపి, నెల రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే వారి ఆస్తులు జప్తు చేయాల్సి ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆఫీసర్ల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని వందల కోట్లు కొల్లగొట్టిన మిల్లర్లు.. కొద్ది రోజులు జైలుకు వెళ్లొచ్చి దర్జాగా తిరుగుతున్నారు.

దీంతో ఏటా డీఫాల్టర్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారుల నిర్లక్ష్యం ఇందుకు కారణమని, కొందరు అధికారులు కనీసం రైస్ మిల్లులను ప్రతి నెలా తనిఖీ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.