రైల్వే బ్రిడ్జిల పై కాంగ్రెస్ నిర్లక్ష్యం : ఎంపీ అర్వింద్

రైల్వే బ్రిడ్జిల పై కాంగ్రెస్ నిర్లక్ష్యం : ఎంపీ అర్వింద్
  •     మాధవనగర్​ ఓవర్​ బ్రిడ్జి వద్ద ఎంపీ అర్వింద్​ ధర్నా
  •     రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వడంలేదని భిక్షాటన చేసి నిరసన

నిజామాబాద్, వెలుగు : మాధవనగర్​ రైల్వే ఓవర్​ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని ఎంపీ ధర్మపురి డిమాండ్ చేశారు. కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం సహకరించడం లేదన్నారు. నిజామాబాద్​ జిల్లా మాధవనగర్​ బ్రిడ్జి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కమిషన్ల భయానికి కాంట్రాక్టర్లు పారిపోయారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి లను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రైల్వే నిధుల కోసం నేను ధర్నా ప్రకటిస్తే కాంగ్రెస్ నేతలు సీఎంను కలిశారని ఎద్దేవా చేశారు. 

రాజకీయాలు పక్కనబెట్టి నిధులు మంజూరు చేయాలని, రూ.9 కోట్ల ఫైనాన్స్ క్లీయరెన్స్ ఇవ్వాలని కోరారు. మాధవ నగర్ ఆర్వోబీకి రూ.9 కోట్లు కూడా ఇవ్వని సీఎం రేవంత్.. కొడంగల్ కి మాత్రం వందల కోట్లు తరలిస్తున్నారని, ఆయన రాష్ట్రానికి సీయమా, కొడంగల్ కి మాత్రమేనా? అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతికి రేవంత్ ఆజ్యం పోశాడన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్​పాల్ సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఎంపీ అర్వింద్, బీజేపీ లీడర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.