సినిమా థియేటర్లో ఉండే అద్భుతమైన విజువల్, ఆడియో అనుభూతిని ఓపెన్ గ్రౌండ్లోనూ అందించవచ్చని నిరూపించింది 'ఓ నా సిద్ధయ్య' టీమ్. భారతదేశంలోనే తొలిసారిగా అవుట్డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో అక్టోబర్ 30న జరిగిన ఈ వేడుకకు ఏకంగా 5 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు.
ఈ వేడుకకు ప్రముఖ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరై 'ఓ నా సిద్ధయ్య' పాటను ఆవిష్కరించారు. ఓపెన్ గ్రౌండ్లో 70ఎంఎం స్క్రీన్, డాల్బీ అట్మాస్‌తో ఇలాంటి వినూత్న ప్రయోగం చేయడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ కూడా కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హీరో ఇంద్రరామ్, గాయకుడు నల్గొండ గద్దర్ నరసన్న, బోలే షావలి, నటుడు ఉత్తేజ్ తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు.
ఇక 'ఓ నా సిద్ధయ్య' పాట విషయానికి వస్తే.. ఇది కేవలం ప్రేమగీతం మాత్రమే కాదు.. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం, నమ్మకం, ఆప్యాయతలను ఆవిష్కరించే హృద్యమైన కథ. పల్లెటూరి నేపథ్యంలో సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రల ద్వారా దాంపత్య జీవితంలోని అందమైన భావోద్వేగాలను చూపించారు. సిద్ధయ్య పాత్రలో నటించడంతో పాటు సిద్ధు రెడ్డి కందకట్ల ఈ పాటను నిర్మించారు. కత్యాయని జగన కథానాయికగా నటించగా, కల్యాణ్ కీస్ సంగీతం అందించారు.
►ALSO READ | Balu Geetha OTT Release : ఓటీటీలోకి మరో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ.. 'బాలు గీత' ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ టీమ్ వినోదంతో పాటు సామాజిక బాధ్యతకూప్రాధాన్యత ఇస్తోంది. గతంలో 300 మంది ఆటో డ్రైవర్లకు బీమా సదుపాయాలు కల్పించడంతో పాటు సినీ కార్మికులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. మొత్తానికి పాట విడుదలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా కూడా 'ఓ నా సిద్ధయ్య' టీమ్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
