Pony Verma : అడ్వాన్స్‌లు ఇచ్చాక కూడా తొలగించారు.. ప్రకాశ్‌రాజ్‌ కెరీర్‌పై పోనీ వర్మ షాకింగ్ కామెంట్స్!

Pony Verma : అడ్వాన్స్‌లు ఇచ్చాక కూడా తొలగించారు.. ప్రకాశ్‌రాజ్‌ కెరీర్‌పై పోనీ వర్మ షాకింగ్ కామెంట్స్!

వెండితెరపై విలక్షణ నటనతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్‌. విలన్‌గా భయపెట్టినా, తండ్రిగా భావోద్వేగాలు పండించినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కథకు బలాన్నిచ్చినా ఆయనకు ఆయనే సాటి. అలాంటి నటుడు ఇప్పుడు సినిమాల్లో కాస్త తక్కువగా కనిపిస్తుండటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనికి కారణం ఆయన నటనకు దూరం కావడమా? లేక రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలా? లేటెస్ట్ గా ఆయన భార్య, కొరియోగ్రాఫర్ పోనీ వర్మ  ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది.

 ప్రకాశ్‌రాజ్ రాజకీయాలపై బహిరంగంగా మాట్లాడటం మొదట్లో తనను ఆందోళనకు గురిచేసేదని పోనీ వర్మ వెల్లడించారు. ముఖ్యంగా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఘటన తర్వాత ఆయన ఆలోచనా విధానంలో కీలక మార్పు వచ్చిందని చెప్పారు. 'ఇలా భయపడుతూ ఎన్నాళ్లు బతకాలి?' అనే ప్రశ్నతోనే సామాజిక, రాజకీయ అంశాలపై మరింత బలంగా తన గళాన్ని వినిపించడం ప్రారంభించారని వివరించారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో ప్రకాశ్‌రాజ్ చేసే పోస్టులు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. అయితే ఈ బహిరంగ వైఖరి ఆయన కెరీర్‌పై ప్రభావం చూపిందని పోనీ వర్మ తెలిపారు. రాజకీయ వ్యాఖ్యల కారణంగా చేతికి రావాల్సిన సినిమా అవకాశాలు చేజారిపోయాయని, ప్రకటనల ప్రాజెక్టులు కూడా దూరమయ్యాయని వెల్లడించారు. అంతేకాదు, కొందరు దర్శక నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని సినిమాల నుంచి తప్పించిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు.

ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా ప్రకాశ్‌రాజ్ మాత్రం తన అభిప్రాయాలను మార్చుకునేందుకు సిద్ధంగా లేరని పోనీ వర్మ స్పష్టం చేశారు. తన మనస్సాక్షికి తప్పుగా అనిపించిన పనిని అంగీకరించకూడదనేది ఆయన నిర్ణయమని చెప్పారు. నటుడిగా సంపాదించిన గుర్తింపుతో పాటు వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛకు కూడా ప్రకాశ్‌రాజ్ ప్రాధాన్యత ఇస్తున్నారని పోనీ వర్మ స్పష్టం చేసింది.