న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేకు ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పేపర్ లీక్ అంశంపై స్పందించేందుకు నిరాకరించిన దిల్జిత్ దోసాంజేను గతంలో దీప్కే విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 30న ఢిల్లీలో ఔరా ఇండియా టూర్ పేరుతో దిల్జిత్ దోసాంజే మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దీప్కే వ్యాఖ్యలకు దిల్జిత్ పరోక్షంగా ఘాటు కౌంటర్ ఇచ్చారు.
‘‘నేను సైలెంట్‌గా ఉంటున్నాను కాబట్టి నన్ను అలాగే ఉండనివ్వండి. నేను అందరినీ ప్రేమిస్తాను. ఒక కారణం కోసం నిలబడటం పంజాబీలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కాబట్టి పంజాబీలకు పోరాటాలు ఎలా చేయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. ఏ వేదికపై నిలబడితే నా తన సట్లజ్ సినిమాను ఎగతాళి చేశారో.. ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి మేము ఎన్నో ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేశాం’’ దీప్కేకు కౌంటర్ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే..?
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా 2026, జూలైలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిరసనలపై స్పందించమని ఓ అభిమాని కోరగా.. ఇందుకు దిల్జిత్ దోసాంజ్ నిరాకరించాడు. నేను కేవలం ఒక కళాకారుడిని బ్రో, నన్ను ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉంచండి అన్నాడు. దిల్జిత్ వ్యాఖ్యలపై దీప్కే విమర్శలు గుప్పించాడు. ఒక పెద్ద సెలబ్రిటీ అయి ఉండి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలు మీ సినిమాలు నిషేధిస్తారని హెచ్చరించాడు. దీప్కే వ్యాఖ్యలకు అక్టోబర్ 30న ఢిల్లీలో నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పంజాబీలకు పోరాటాలు ఎలా చేయాలో నేర్పించాల్సిన అవసరం లేదన్నాడు.
►ALSO READ | జ్ఞానేష్కు సీఈసీగా కొనసాగే అర్హతే లేదు.. వెంటనే పదవి నుంచి తొలగించండి: రాహుల్
ఇక్కడితో వదిలేద్దాం బ్రో: దీప్కే
ఢిల్లీ కాన్సర్ట్‌లో దిల్జిత్ దోసాంజ్ చేసిన వ్యాఖ్యలపై అభిజిత్ దీప్కే రియాక్ట్ అయ్యాడు. ఒక పెద్ద ప్రజాసమస్యపై దిల్జిత్ మాట్లాడలేదనే నిరాశతోనే తాను గతంలో అలా మాట్లాడానని క్లారిటీ ఇచ్చాడు. తన వ్యాఖ్యలు దిల్జిత్‌ను బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
తాను ఇప్పటికీ దిల్జిత్ అభిమానినేనని.. గతంలో ఆయన చికాగో మ్యూజిక్ కాన్సర్ట్‌కు కూడా హాజరయ్యానని గుర్తు చేశాడు. తనను ఒక తమ్ముడిగా భావించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని దీప్కే రిక్వెస్ట్ చేశాడు.
