దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాం.. అర్బన్ నక్సలిజాన్ని కూడా అంతం చేస్తం: ప్రధాని మోడీ

దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాం.. అర్బన్ నక్సలిజాన్ని కూడా అంతం చేస్తం: ప్రధాని మోడీ

గాంధీనగర్: దేశంలో నక్సలిజాన్ని లేకుండా చేశాం.. అర్బన్ నక్సలిజాన్ని కూడా అంతం చేస్తామని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‎లోని ఏక్తానగర్‎లో నిర్వహించిన జాతీయ ఐక్యత దివాస్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్  విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నక్సలైట్ల హింస నుంచి దేశానికి విముక్తి కల్పించామని చెప్పారు. 

గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలకు నక్సల్స్ పీడ నుంచి విముక్తి కలిగిందన్నారు. నక్సల్స్ పీడ తొలగడంతో అన్ని ప్రాంతాలకు రోడ్డు, టెలికాం సేవలు పెరుగుతున్నాయని చెప్పారు. భారత్‎లో పేదరికం భారీగా తగ్గిందని ప్రపంచబ్యాంక్ నివేదిక చెప్పిందని.. 2014 నుంచి భారత్‎లో క్రమంగా నిరుపేదల సంఖ్య తగ్గుతోందన్నారు. దేశంలో 100 కోట్ల మందికి సురక్ష ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని చెప్పారు. 

ఐక్యమత్యమే మనల్ని దేశంగా ముందుకు నడిపిస్తోందని.. సర్దార్ పటేల్ చూపిన మార్గంలోనే దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అయితే, దిమాగీ నక్సల్స్ కుట్రలు, కుతంత్రాలు ఈ దేశానికి మరింత ప్రమాదకరమని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అస్థిరపరచాలనుకునే దీమాగి నక్సల్స్ ఆందోళనలు, ధర్నాలు కుట్రలను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. 

ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్.. అనేదే మన నినాదం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే భారత దేశ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలు ఐక్యంగా ఉంటే వారంతా ఏమి చేయలేరని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోవాలని పిలుపునిచ్చారు.