ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన ఇద్దరు కుకీ యువకులు విగతజీవులుగా కనిపించారు. సేనాపతి జిల్లా పరిధిలోని ఓ అరటి తోటలో గోనె సంచుల్లో కుక్కిన స్థితిలో వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
నాగా మిలిటెంట్లే యువకులను కిడ్నాప్ చేసి హత్య చేశారంటూ స్థానికులు ఆరోపించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్‌పోక్పి జిల్లా తఫౌ కుకీ గ్రామానికి చెందిన టి. చోంగ్లోయ్ (21), పావోగిన్‌లాల్ హాంగ్‌సింగ్ (20) అక్టోబర్ 29న అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు, సీఆర్‌పీఎఫ్, అస్సాం రైఫిల్స్ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.
ఈ క్రమంలో సేనాపతి జిల్లా సరిహద్దులోని అరటి తోటలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు కాంగ్‌పోక్పి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు మృతదేహాలను అంత్యక్రియల కోసం గ్రామానికి తీసుకెళ్లబోమని తేల్చిచెప్పారు.
