క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. బైనాన్స్ నుంచి రూ.57 వేల కోట్ల చోరీ 

క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. బైనాన్స్ నుంచి రూ.57 వేల కోట్ల చోరీ 

న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌ అయిన బైనాన్స్ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడికి గురైంది. అక్టోబర్ 29 గురువారం నాటి ఈ భారీ డిజిటల్ చోరీలో కంపెనీ వాలెట్ల నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ.57 వేల కోట్లకు పైగా) విలువైన డిజిటల్ కరెన్సీలను హ్యాకర్లు కొట్టేశారు.  

ఇంటర్నేషనల్ న్యూస్‌‌‌‌‌‌‌‌పేపర్ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. క్రిప్టో చరిత్రలోనే ఇది అతిపెద్ద హ్యాకింగ్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కింది. ఈ భారీ దోపిడీ వెనుక ఉత్తర కొరియాకు చెందిన అత్యంత ప్రమాదకర హ్యాకింగ్ ముఠా ‘ట్రేడర్ ట్రైటర్’  హస్తం ఉందని బ్లాక్‌‌‌‌‌‌‌‌చెయిన్ నిఘా సంస్థలైన చైనాలసిస్, టీఆర్ఎమ్ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌తో పాటు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌‌‌‌‌‌‌‌బీఐ ఆరోపించాయి. 

ఆ రోజు ఏం జరిగింది..?

అక్టోబర్ 29 సాయంత్రం 4:20 గంటల సమయంలో బైనాన్స్ వాలెట్ల నుంచి భారీ మొత్తంలో క్రిప్టో ఆస్తులు అనుమానాస్పదంగా గుర్తుతెలియని ఖాతాల్లోకి తరలిపోవడం ప్రారంభమైంది. విషయం తెలుసుకున్న వెంటనే బైనాన్స్ యాజమాన్యం అప్రమత్తమైంది. డిపాజిట్లు, విత్‌‌‌‌‌‌‌‌డ్రాయల్స్‌‌‌‌‌‌‌‌ను వెంటనే నిలిపివేసింది. సంస్థ కో–సీఈఓ హే యి రాత్రంతా దాదాపు 100 మంది భద్రతా నిపుణులతో అత్యవసర రక్షణ చర్యలు చేపట్టారు. 

కంపెనీ ఫౌండర్ చాంగ్‌‌‌‌‌‌‌‌పెంగ్ జావో సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఖాతాదారులకు ధైర్యం చెబుతూ.. వినియోగదారుల సొమ్ము సురక్షితంగా ఉందని, జరిగిన నష్టాన్ని కంపెనీయే పూర్తిగా భరిస్తుందని భరోసా ఇచ్చారు. ఇందుకోసం సంస్థ ఏకంగా 6.34 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.60 వేల కోట్ల) ను ప్రత్యేక నిధిగా కేటాయించింది.

ఉత్తర కొరియా హ్యాకర్ల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ 

హ్యాకర్లు బైనాన్స్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్ ద్వారా అంతర్గత వ్యవస్థల్లోకి చొరబడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో బైబిట్  వంటి ఎక్స్ఛేంజీలపై దాడి చేసినట్టే, ఉత్తర కొరియా సైబర్ ముఠాలు దోచుకున్న సొమ్మును ఆ దేశ అణ్వాయుధాలు, క్షిపణి ప్రాజెక్టుల కోసం వాడుతున్నాయని వెస్ట్రన్ దేశాల నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈసారి హ్యాకర్లు అత్యంత సంక్లిష్టమైన ఆటోమేషన్ పద్ధతుల్లో వేలాది లావాదేవీల ద్వారా సొమ్మును క్షణాల్లో తరలించారు. దోచుకున్న నిధులు చేతులు మారకుండా ఇతర క్రిప్టో సంస్థలు తక్షణమే స్పందించాయి. స్టేబుల్‌‌‌‌‌‌‌‌కాయిన్ సంస్థలైన టెథర్, సర్కిల్ కలిసి హ్యాకర్లతో లింక్ ఉన్న 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.19 వేల కోట్ల) ఆస్తులను వెంటనే ఫ్రీజ్ చేశాయి. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కూడా 27 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.256.5 కోట్ల)  విలువైన క్రిప్టోను ఫ్రీజ్ చేసింది. అయితే అప్పటికే సుమారు 2.4 బిలియన్ డాలర్ల (రూ.22,800 కోట్ల)  సొమ్మును హ్యాకర్లు నియంత్రణలకు చిక్కకుండా ఇతర మార్గాల్లోకి దాటించేశారు. 

మస్క్‌‌‌‌‌‌‌‌, జావోల మధ్య మాటల యుద్ధం

ఈ ఘటన తర్వాత ఎలాన్ మస్క్, జావోల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర మాటల యుద్ధం నడిచింది. గతంలో (2022లో) శామ్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌మన్–ఫ్రైడ్ నడిపిన 'ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎక్స్‌‌‌‌‌‌‌‌' క్రిప్టో ఎక్స్చేంజ్ ఇలాగే సంక్షోభంలో పడి దివాలా తీసింది. నెటిజన్లు జావోను శామ్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌తో పోలుస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఈ చర్చలోకి ఎలాన్ మస్క్ ప్రవేశించి, బైనాన్స్ పరిస్థితిపై ఎద్దేవా చేస్తూ సెటైరికల్ కామెంట్లు చేశారు.

కంపెనీ ఇంత పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటూ నిధులను కాపాడే ప్రయత్నంలో ఉన్న పరిస్థితుల్లో మస్క్ బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై జావో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో అనవసరమైన కామెంట్లు, ఎగతాళి చేయడం మానుకోవాలని మస్క్‌‌‌‌‌‌‌‌ను కోరారు.

అంతేకాకుండా, "మస్క్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రైవేట్ రాకెట్ సంస్థ 'స్పేస్‌‌‌‌‌‌‌‌ఎక్స్'లో బైనాన్స్‌‌‌‌‌‌‌‌కు 1 బిలియన్ డాలర్లకు పైగా విలువైన వాటాలు ఉన్నాయి" అనే విషయాన్ని జావో బహిరంగంగా గుర్తుచేశారు. ఆ తర్వాత బైనాన్స్ కో–సీఈఓ హేయి కూడా స్పందిస్తూ.. హ్యాకింగ్ వల్ల జరిగిన నష్టాన్ని భరించడానికి తాము స్పేస్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ షేర్లను అమ్మాల్సిన అవసరం లేదని, బైనాన్స్ వార్షిక ఆదాయమే ఈ నష్టాన్ని పూర్తిగా పూడ్చడానికి సరిపోతుందని స్పష్టం చేశారు.